మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృత‌దేహం ల‌భ్యం

Software Engineer dead body found.మ‌ణికొండ‌లో రెండు రోజుల క్రితం నాల‌లో ప‌డి గ‌ల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sept 2021 6:22 PM IST
మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృత‌దేహం ల‌భ్యం

మ‌ణికొండ‌లో రెండు రోజుల క్రితం నాల‌లో ప‌డి గ‌ల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ర‌జ‌నీకాంత్(42) మృత‌దేహాం ల‌భ్య‌మైంది. నెక్నాంపూర్‌ చెరువులో గుర్ర‌పు డెక్క తొల‌గిస్తుండ‌గా అత‌డి మృత‌దేహాం క‌నిపించింది. గత శనివారం(సెప్టెంబ‌ర్ 25)న మణికొండ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో నాలా వర్క్ జ‌రుగుతోంది. భారీ వర్షానికి అక్క‌డ ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు కొట్టుకుపోయాయి. పెరుగు ప్యాకెట్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన రజినీకాంత్.. మణికొండ గోల్డెన్ టెంపుల్ ముందు నడుచుకుంటూ వెలుతుండ‌గా.. డ్రైనేజీలో ప‌డిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు అప్ప‌టి నుంచి ర‌జినీకాంత్ కోసం గాలింపు చేప‌ట్టినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. తూములు వెళ్లి నాళా కలిసే ప్రాంతంలో ఒక బృందం గాలించగా.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలింపు చర్యలు జరిపింది. ఈ క్ర‌మంలో నెక్కాంపూర్ చెరువులో గుర్ర‌పు డెక్కాను తొల‌గిస్తుండ‌గా ర‌జినీకాంత్ మృత‌దేహాం సోమ‌వారం క‌నిపించింది. వ‌ర‌ద ప్ర‌వాహానికి మూడు కిలోమీట‌ర్ల దూరం అత‌డి మృత‌దేహం కొట్టుకువ‌చ్చింది. రజినీకాంత్ మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ర‌జినీకాంత్ షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు.

Next Story