అపార్టుమెంటు ఆరో అంతస్థు నుంచి పడిపోయిన బాలుడు.. ఎలా బతికాడంటే?
హైదరాబాద్: అపార్టుమెంటుపై నుంచి కిందపడిన పదేళ్ల బాలుడికి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు పలు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు.
By అంజి Published on 13 Aug 2023 8:15 AM GMTఅపార్టుమెంటు ఆరో అంతస్థు నుంచి పడిపోయిన బాలుడు.. ఎలా బతికాడంటే?
హైదరాబాద్: అపార్టుమెంటు ఆరో అంతస్థు నుంచి పొరపాటున కాలు జారి కింద పడిపోయిన పదేళ్ల బాలుడికి నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు పలు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి, అతడి ప్రాణాలు కాపాడారు. లోహిత్ అనే ఆ బాలుడిని జూన్ ఒకటో తేదీన ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో హుటాహుటిన తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి అతడికి స్పృహ లేదు. ముఖం, తల నుంచి రక్తం కారుతోంది. రక్తపోటు (బీపీ) అసలు రికార్డు చేయలేనంత తక్కువ స్థాయిలో ఉంది. అతడి కుడి తొడ, ఎడమ చేతి ఎముకలు పలుచోట్ల విరిగిపోయాయి. దవడ ఎముక కూడా విరిగింది. మెదడులో కుడి, ఎడమవైపుల రక్తం గడ్డకట్టింది. అతడి రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి కేవలం 6 గ్రాములే ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.
లోహిత్‌కు చికిత్స చేసిన ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలోని న్యూరోసర్జరీ విభాగాధిపతి, సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ర రంగనాథన్.. ఆ బాలుడి పరిస్థితి గురించి, అతడికి అందించిన చికిత్సా విధానాల గురించి వివరించారు. “మొదట్లో అతడి మెదడు స్పందించకపోవడంతో ముందుగా ఐదు రోజుల పాటు రక్తం ఎక్కించాం. క్రమంగా పరిస్థితి కొంత మెరుగుపడటంతో, ఐదోరోజు సాయంత్రం అతడి కుడి మెదడులో విరిగిన ఎముక ముక్కలు తొలగించేందుకు అత్యవసర శస్త్రచికిత్స చేశాం. పుర్రె, వెన్నెముక మధ్య ఉన్న బాహ్య, మందమైన బలమైన పొర అయిన డ్యూరామేటర్‌ను శస్త్రచికిత్స ద్వారా తెరిచాం. దీనివల్ల మెదడు ఒత్తిడిని విడుదల చేయడానికి స్పష్టమైన, రంగులేని, నీటి ద్రవమైన సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (సిఎస్ఎఫ్) ను తొలగించడానికి వీలుపడింది. దీంతోపాటు ఎక్స్‌టర్నల్ వెంట్రిక్యులర్ డ్రైనేజీ (ఈవీడీ) కూడా నిర్వహించాం.
ఈ శస్త్రచికిత్స చేసిన ఐదు రోజుల తర్వాత లోహిత్ కళ్లు తెరిచాడు. మెదడు శస్త్రచికిత్స పూర్తయ్యాక, ఆర్థోపెడిక్ సర్జన్లు అతడి తొడ, చేతిలో ఉన్న ఫ్రాక్చర్లకు చికిత్స కోసం శస్త్రచికిత్సలు చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి బాలుడు సరిగా ఊపిరి తీసుకోలేకపోతుండటంతో.. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ పంపేందుకు ట్రాకియాస్టమీ చేశారు. దవడ ఎముక విరగడం, ముఖం మీద ఇతర గాయాలూ ఉండటంతో ఫేషియోమాక్సిలరీ సర్జరీ చేశారు. దాదాపు మూడు వారాల తర్వాత బాలుడు లేచి తిరగగలిగాడు” అని డాక్టర్ రంగనాథం వివరించారు.
ఈ శస్త్రచికిత్సలలో కన్సల్టెంట్ న్యూరోసర్జన్లు డాక్టర్ జి.రవికిరణ్, డాక్టర్ కొడాలి సంధ్య, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నరసింహారెడ్డి, కన్సల్టెంట్ ప్లాస్లిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ అమర్ రఘు, ఎనస్థీషియా వైద్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ రాజ్‌కుమార్, ఆయన బృందం, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ అప్పిరెడ్డి, ఆయన బృందం పాల్గొన్నారు.
లోహిత్ తండ్రి జి.రాజేష్ మాట్లాడుతూ, “గడిచిన నెల రోజులుగా మా బాబు ప్రాణాలు కాపాడేందుకు ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు.. ముఖ్యంగా డాక్టర్ రంగనాథం చేసిన కృషికి మేం ఎంత చేసినా తక్కువే. దురదృష్టకరమైన ఆ ప్రమాదం జరిగిన తర్వాత మా అబ్బాయి లోహిత్‌ను ఇక్కడకు తీసుకొచ్చిన రోజు నాకు ఇప్పటికీ కళ్లముందే ఉంటుంది. డాక్టర్ రంగనాథం మాకు ముందుగా కౌన్సెలింగ్ చేసి, బాబుకు అయిన గాయాల గురించి చెప్పి, మాకు విశ్వాసం కలిగించారు. మా అబ్బాయి విషయంలో ఎస్ఎల్‌జీ వైద్యులు చాలా క్రమ పద్ధతిలో చేసిన చికిత్స వల్లే వాడు ఇంత వేగంగా కోలుకున్నాడు” అని సంతృప్తి వ్యక్తం చేశారు.
జూలై 1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోహిత్‌ను దూరప్రాంతం నుంచే ఐదు వారాల పాటు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు లోహిత్ వాకర్ సహాయంతో నడవగలుగుతున్నాడు. ఇప్పటినుంచి అతడి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈ బాలుడికి చేసిన సంక్లిష్టమైన చికిత్స.. ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో ఉన్న మల్టీ-సూపర్ స్పెషాలిటీ నైపుణ్యాలకు నిదర్శనం. ఈ గొప్ప విజయాన్ని సాధించిన డాక్టర్ రంగనాథం, ఇతర వైద్యులు, సహాయక సిబ్బందిని ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.వి.ఎస్.సోమరాజు అభినందించారు.
ఎస్ఎల్‌జీ ఆస్పత్రి గురించి:
ఎస్ఎల్‌జీ ఆస్పత్రి హైదరాబాద్‌లోని నిజాంపేట ప్రాంతంలోని బాచుపల్లిలో ఉంది. ఇందులో వివిధ స్పెషాలిటీలలో 999 పేషెంట్ కేర్ బెడ్లు ఉన్నాయి. వారికి అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు, సమగ్ర వైద్యసంరక్షణ, వ్యాధినిరోధక విభాగం కూడా ఉన్నాయి. అన్ని వయసుల వారికి స్క్రీనింగ్ ద్వారా ప్రస్తుత జీవనశైలి వల్ల రాబోయే ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. అవి వ్యక్తిగతంగాను, కుటుంబ ఆరోగ్యచరిత్ర ద్వారా వచ్చినా గుర్తిస్తారు.