నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతం

హైదరాబాద్‌ నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది.

By M.S.R  Published on  20 Sept 2023 8:34 PM IST
నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతం

హైదరాబాద్‌ నగరంలోని నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది. ఈ కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడ్ని సురక్షితంగా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు పిల్లాడిని అప్పగించారు.

సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పిల్లాడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ పని చేశారని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మమతకు గతంలో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. దీంతో ఓ బిడ్డను ఎత్తుకెళ్ళి పెంచుకోవాలని మమత, ఆమె భర్త నిర్ణయించుకున్నారు.

తమ కుమారుడి ఆరోగ్యం బాలేదంటూ నిలోఫర్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఉన్న పిల్లలను గమనిస్తూ వచ్చారు. ఎవరైనా బిడ్డను అదను చూసి ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఆస్పత్రిలో చేరిన వాళ్లతో పరిచయం పెంచుకుని ఫైసల్‌ఖాన్‌ అనే చిన్నారి మీద దృష్టి పెట్టారు. ఫైసల్‌ తల్లి భోజనం తేవడానికి వెళ్లిన సమయంలో బిడ్డను తీసుకుని పారిపోయారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ఈ జంటకు సహకరించారు. బిడ్డ కనిపించకపోయే సరికి తల్లి ఆ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. ఆపై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కిడ్నాపర్లను పట్టుకోవడం కష్టతరంగా మారింది. ఆస్పత్రి సమీపంలోనే సీసీ ఫుటేజీల ద్వారా కేసు చేధించగలిగారు. జేబీఎస్‌ అక్కడి నుంచి నిజామాబాద్‌, కామారెడ్డికి చేరుకున్నారు. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఈ జంటను పట్టుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. సెప్టెంబర్ 14న ఈ కిడ్నాప్ ఉదంతం చోటు చేసుకుంది.

Next Story