గోధుమలు, మైదా ధరల పెరుగుదల.. బేకరీలపై ప్రతికూల ప్రభావం
Sharp hike in wheat maida prices force Hyd bakeries to increase rates.గత కొద్ది రోజులుగా బేకరీల్లోని ఐటమ్స్ ధరలు
By తోట వంశీ కుమార్ Published on 8 July 2022 7:55 AM ISTహైదరాబాద్ : గత కొద్ది రోజులుగా బేకరీల్లోని ఐటమ్స్ ధరలు పెరగడాన్ని మనం గమనించవచ్చు. అన్ని పదార్థాల ధరలు పెరగనప్పటికీ చాలా వరకు ఐటమ్స్ ధరల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. ఇందుకు కారణం వాటి తయారికి కావాల్సిన ముడి పదార్థాల ధరలు పెరగడమే. బ్రెడ్ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, కేకులు, పఫ్‌లు, కుకీలుతో పాటు మరికొన్ని ఐటమ్స్ ధరలను బేకరీలు పెంచేశాయి.
చాలా కారణాల వల్ల బేకరీ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని హైదరాబాద్‌లోని సిండ్రెల్లా బేకరీ యజమాని అమన్ ఖేతాని అన్నారు. ఈ ఏడాది మార్చి,ఏప్రిల్ నుంచి గోధమ ధర పెరగడం కూడా ఒక కారణంగా ఆయన చెప్పారు.
మార్చి నుంచి గోధుమల ధరలు దాదాపు 42 శాతంపెరిగింది. మార్చి నెలలో హోల్‌సేల్‌లో కిలో గోధుమలు రూ.28 ఉండగా ఇప్పుడు కిలో రూ.40కి చేరింది. అలాగే మైధా ధర కూడా పెరిగింది. అప్పట్లో కిలో రూ.౫౨ కాగా.. ఇప్పుడు రూ.60 కి చేరింది.
"ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల కారణంగా, మేము కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచవలసి వచ్చింది. గోధుమలు, మైదా ధరల పెరుగుదలే ధరలు పెరగడానికి కారణం కాదు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం కూడా ఓ కారణం" అని అమన్ తెలిపారు.
గ్యాస్ (ఎల్పీజీ) ధర సిలిండర్‌కు రూ. 50 పెరుగుతోంది. మే తర్వాత ఇది మూడో పెరుగుదల. జూన్ 2021 నుంచి చూసుకున్నయిట్లే సిలిండర్‌పై రూ.244 పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి అయితే రూ.150 మేర పెరిగింది. అనేక బేకరీలు డీజిల్ అవసరమయ్యే ఓవెన్లు మరియు వంట సామాను కూడా ఉపయోగిస్తాయి. డీజిల్ రేట్ల పెంపు పలు బేకరీలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 97. గత ఆరు నెలల్లో డీజిల్ ధర రూ.10 పెరిగింది.
కూకట్‌పల్లిలోని మరో బేకరీ ధరలను పెంచకుండా ఉత్పత్తిని సగానికి తగ్గించింది. "మాకు ఉన్న కొద్దిపాటి సాధారణ కస్టమర్లను కోల్పోవాలని మేము కోరుకోవడం లేదు. అందుకే, మేము దీన్ని చేసాము. చాలా చిన్న తరహా బేకరీలు దీన్ని చేస్తున్నాయి. ఇది సమయం , శ్రమను కూడా తగ్గిస్తుంది" అని బేకరీ యజమాని సర్ఫరాజ్ చెప్పారు.