హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ప్రస్తుతం పలు నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌లోని నివాసితులకు ఈరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.
By అంజి Published on 27 Nov 2024 10:15 AM ISTహైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్: ప్రస్తుతం పలు నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్‌లోని నివాసితులకు ఈరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఈ అంతరాయం గురించి ప్రజలను అప్రమత్తం చేసింది. అసౌకర్యాన్ని తగ్గించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని వారికి విజ్ఞప్తి చేసింది.
అలియాబాద్ రిజర్వాయర్ పంపింగ్ స్టేషన్ వద్ద విద్యుత్ అంతరాయం కారణంగా నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అలియాబాద్ 33/11 KV సబ్‌స్టేషన్‌లో TGSPDCL నిర్వహిస్తున్న నిర్వహణ పనుల ఫలితంగా ఈ అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరా అంతరాయం హైదరాబాద్‌లోని అనేక ఏరియాల్లో ప్రభావం చూపనుంది.
బాదం మసీదు, బాలగంజ్, మహంకాళి ఆలయం, లాల్ దర్వాజా, మిత్ర క్లబ్, ఛత్రినాక, గాంధీ విగ్రహం, శ్రీనివాస్ హైస్కూల్ ఏరియా, శ్రీరామ్ నగర్, పాండురంగారావు వీధి, CIB క్వార్టర్స్, హరిజన బస్తీ, గౌలిపుర, మేకల మండి, సర్దాపేట్ నగర్, లక్ష్మి నగర్, హమామ్ బౌలి, బోయిగూడ, కందికల్ గేట్, DK కాలనీ, రాజన్న బౌలి, క్వాడ్రీ చమన్ ప్రాంతాల్లోని నివాసితులు వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి తగిన నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
20 రోజుల్లో రెండో పెద్ద అంతరాయం
గత 20 రోజుల్లో హైదరాబాద్‌లో నమోదైన రెండో ముఖ్యమైన తాగునీటి సమస్య ఇది. ఈ నెల ప్రారంభంలో.. మంజీరా ఫేజ్-2 పైప్‌లైన్‌లో అవసరమైన మరమ్మత్తు పని పలు పరిసర ప్రాంతాలలో నీటి సరఫరా అంతరాయాలకు దారితీసింది. పైప్‌లైన్‌లో గణనీయమైన లీకేజీలు ఉన్నాయని HMWSSB నివేదించింది.