సికింద్రాబాద్‌లో అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

Secunderabad major fire broke out at ruby electric bike showroom.సికింద్రాబాద్‌ లో రూబీ ల‌గ్జ‌రీ ఫ్రైడ్ పేరిట‌ అయిదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2022 2:35 AM GMT
సికింద్రాబాద్‌లో అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

కింద బైక్ షో రూమ్‌.. పైన లాడ్జి. నిత్యం ర‌ద్దీగా ఉండే ఏరియా. అప్ప‌టి వ‌ర‌కు చాలా ప్ర‌శాంతంగా ఉంది అక్క‌డి వాతావ‌ర‌ణం. అయితే.. ఒక్క‌సారిగా భారీ శ‌బ్దాల‌తో ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ద‌ట్ట‌మైన పొగ‌తో వివిధ ప‌నుల మీద న‌గ‌రానికి వ‌చ్చి లాడ్జిలో బ‌స చేస్తున్న వారు ఊపిరి ఆడ‌క ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు ఆఫీసు సమీపంలో రూబీ ల‌గ్జ‌రీ ఫ్రైడ్ పేరిట‌ అయిదు అంత‌స్తుల భ‌వ‌నం ఉంది. సెల్లూర్‌, గ్రౌండ్ ఫ్లోర్ల‌లో రూబీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల షోరూంని నిర్వ‌హిస్తున్నారు. మిగిలిన నాలుగు అంత‌స్తుల్లో హోట‌ల్ న‌డుస్తోంది. సోమ‌వారం రాత్రి 9.40 గంట‌ల స‌మ‌యంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంట‌లు చెల‌రేగాయి. విద్యుత్ షార్ట్ స‌ర్య్కూట్‌తోనే మంట‌లు వ్యాపించిన‌ట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

మంట‌ల కార‌ణంగా షోరూమ్‌లోని ఎల‌క్ట్రిక‌ల్ బైక్‌ల బ్యాట‌రీలు భారీ శ‌బ్ధంతో ఒక్కొక్క‌టిగా నిమిషాల వ్య‌వ‌ధిలో పేలాయి. దీంతో మంట‌ల ఉద్ధృతి మ‌రింత పెరిగింది. ఉవ్వెత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఏం జ‌రుగుతుందో తెలిసే లోపు వాహ‌నాలు, బ్యాట‌రీల కార‌ణంగా ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ అలుముకుంది. పై అంత‌స్తుకు మంట‌లు వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన కొంత మంది హోట‌ల్ గ‌దుల నుంచి ప‌రుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొంద‌రు మాత్రం ద‌ట్ట‌మైన పొగ‌ల కార‌ణంగా బ‌య‌ట‌కు రాలేక గ‌దుల్లో చిక్కుకుపోయారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. చాలా శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. హోటల్‌లో దట్టంగా పొగలు అలుముకోవడంతో పై అంతస్తుకు వెళ్లేందుకు ఒకే దారి ఉండటంతో అగ్నిమాపక, పోలీసు సిబ్బంది లోపలి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యారు.

లాడ్జిలో 23 గ‌దులున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో దాదాపు 25మంది ప‌ర్యాట‌కులు ఉన్నట్లు తెలుస్తోంది. ద‌ట్టంగా పొగ కమ్ముకోవ‌డంతో పాటు ఊరిపి ఆడ‌క కొంద‌రు స్పృహ త‌ప్పి లాడ్జి గ‌దుల‌లో, కారిడార్‌లో ప‌డిపోయారు. ప్రాణాలు కాపాడుకునే క్ర‌మంలో కింద‌కు దూకి ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. లాడ్జిలో చిక్కుకున్న ప‌లువురిని ఫైర్‌ సిబ్బంది సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. గాయపడిన వారిలో ఐదుగురిని యశోధ, మరో 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఓ మ‌హిళ ఉన్నారు. మృతుల్లో విజ‌య‌వాడ‌కు చెందిన ఎ.హ‌రీశ్‌, చెన్నైకు చెందిన సీతారామ‌న్‌, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్న‌ట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సిఉంది.

అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న గురించి తెలియ‌గానే మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మ‌హ‌మూద్ అలీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు.

Next Story
Share it