హైదరాబాద్ కు చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్లు

Second consignment of Sputnik V reaching hyderabad. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు తొలి విడుత‌లో 1.5ల‌క్ష‌ల డోసులు హైద‌రాబాద్ లోని రెడ్డీస్ ల్యాబ్‌కు చేర‌గా.. ఇప్పుడు మ‌రోసారి 1.5ల‌క్ష‌ల డోసుల.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 6:50 AM GMT
Sputnik V

దేశ వ్యాప్తంగా ఓ వైపు క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌గా.. మ‌రోవైపు వ్యాక్సిన్ల కొర‌త‌తో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. కాగా.. ప్ర‌స్తుతం నెల‌కొన్న వ్యాక్సినేష‌న్ కొర‌త‌ను అధిగ‌మించే దిశ‌గా మ‌రో ముంద‌డుగు ప‌డింది. ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు ఆదివారం భార‌త్‌కు చేరుకున్నాయి. ఇప్ప‌టికే తొలి విడుత‌లో 1.5ల‌క్ష‌ల డోసులు హైద‌రాబాద్ లోని రెడ్డీస్ ల్యాబ్‌కు చేర‌గా.. ఇప్పుడు మ‌రోసారి 1.5ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ హైద‌రాబాద్‌కు చేరిన‌ట్లు అధికారులు తెలిపారు. రష్యా నుంచి బయలుదేరిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన కార్గో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఉదయం ల్యాండయింది.

ఈ సంద‌ర్భంగా భార‌త్‌లోని ర‌ష్యా రాయ‌బారి నికోలాయ్ కుడ‌షేవ్ మాట్లాడుతూ..క‌రోనా పై పోరులో ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారం ప‌టిష్టంగా ముందుకు సాగుతోంద‌న్నారు. 2020 ద్వితీయార్థం నుంచి ర‌ష్యాలో ఈ వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. క‌రోనాను ఎదుర్కొన‌డంలో టీకా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌న్నారు. అలాగే కొత్త ర‌కం స్ట్రెయిన్‌ల‌పై కూడా ఈ టీకా పనిచేస్తుంద‌ని తెలిపారు. దేశానికి ర‌ష్యా నుంచి మొత్తం 67 లక్షల డోసులు చేరుకోనున్నాయి. వాటిల్లో భాగంగానే విడ‌తల వారీగా స్పుత్నిక్-వీ వ‌స్తోంది. అంతేగాక‌.. వ‌చ్చే నెల‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్‌ ల్యాబ్ ఉత్ప‌త్తి చేయ‌నుంది.

స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎపిడెమియాలజీ మరియు మైక్రోబయాలజీ అభివృద్ధి చేయగా.. రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఎగుమతి చేసింది. దీంతో ముందుగానే డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ రష్యాతో ఒప్పందం చేసుకొని ఇక్కడ ట్రైల్స్ కూడా జరిపింది. స్పుత్నిక్‌-వీ టీకాకు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లకు తోడుగా ఇప్పుడు మూడో వ్యాక్సిన్‌ సైతం అందుబాటులోకి రావడంతో దేశంలో మూడో ద‌శ వ్యాక్సినేష‌న్‌ ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం కానుంది.దిగుమ‌తి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా ఉంటుంది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌య్యాక దాని ధ‌ర త‌‌గ్గ‌నుంది.




Next Story