హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. 'సెలబ్రేట్ ది స్కై' పేరుతో సంక్రాంతి సంబురాలు జరుగుతాయని ఆయన వివరించారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
జనవరి 13వ తేదీ నుంచి 15 వరకు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 13వ తేదీ నుంచి 15 వరకు నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండగలో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 జాతీయ కైట్ ఫ్లయర్స్ పాల్గోనున్నారని జూపల్లి కృష్ణారావు తెలిపారు. పతంగుల పండుగ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో స్వీట్ ఫెస్టివల్, చేనేత హస్తకళల ప్రదర్శన ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఈ మూడు తేదీలలో ప్రత్యేక నైట్-ఫ్లైయింగ్ ఈవెంట్ జరగనుంది. తెలంగాణ, ఇతర వంటకాలతో కూడిన చేనేత మరియు హస్తకళ స్టాళ్, ఫుడ్ కోర్టులు వేదిక వద్ద ఏర్పాటు చేయబడతాయి. అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్‌ను సంస్కృతి భాషా భారతీయ కనెక్షన్లు (CLIC) సహకారంతో నిర్వహిస్తారు. హైదరాబాద్ నివాసితులు, ఇతర రాష్ట్రాలు మరియు దేశాల స్థానికులు తయారుచేసిన వివిధ రకాల స్వీట్లను పెద్ద సంఖ్యలో ప్రదర్శిస్తారు.