హైదరాబాద్: విచారణను ఎదుర్కొనేందుకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరారు. భారీ భద్రత మధ్య ఆయన తన నివాసం నుంచి లాయర్‌తో కలిసి వెళ్లారు. అటు అల్లు అర్జున్ ఇంటి వద్ద, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన అభిమానులు ఎవరూ ఆయా పరిసరాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనకు నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులు నిన్న అల్లు అర్జున్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ దాదాపు 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆరోపణలపై విచారించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసందే.