ఎండుటాకులతో కంపోస్ట్ తయారీ.. సాకేత్ కాలనీకి జీహెచ్ఎంసీ ప్రశంస
కంపోస్ట్ ఎరువు తయారు చేయడంలో సాకేత్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సాధించిన విజయాన్ని గుర్తించిన GHMC ప్రశంసా పత్రాన్ని
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 2:00 PM ISTహైదరాబాద్ : సహజ ఎరువులతో పంటలు, పండ్లు, కూరగాయలు పండించడం నేడు చాలా మంది అవలంభిస్తున్న విధానం. అయితే డిమాండ్‌కు సరిపడా సేంద్రియ ఎరువులు అందుబాటులో లేవు. కంపోస్టు ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎండు ఆకులను సేకరించి కంపోస్ట్ ఎరువు తయారు చేయడంలో సాకేత్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సాధించిన విజయాన్ని గుర్తించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మార్చి 27 ప్రశంసా పత్రాన్ని అందించింది.
సాకేత్ కాలనీ సికింద్రాబాద్‌లో ఉంది. ఈ కాలనీలో దాదాపు 800 నివాస గృహాలు ఉన్నాయి. ఇది AS రావు నగర్ మరియు కుషాయిగూడకు సమీపంలో ఉంది. ఈ కాలనీలో వారు అందరూ కలిసి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని బావించారు. 2022 సెప్టెంబర్ నుంచి ఎండు ఆకులను కంపోస్ట్ ఎరువుగా మార్చే విధానాన్ని ప్రారంభించారు.
ప్రతి కుటుంబం తమ పెరట్లో రాలిపోయిన అన్ని రకాల ఆకులను సేకరించి సంచుల్లో భద్రపరుస్తారు. ప్రతి నెలకు ఒకసారి కాలనీలోని ప్రతి ఇంటి నుంచి వీటిని అన్నింటింటి రిక్షా ద్వారా సేకరిస్తారు. వీటిని తీసుకువెళ్లి కంపోస్ట్ పిట్‌లో వేస్తారు.
సాకేత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఎస్.రావు మాట్లాడుతూ.. “గృహ కంపోస్ట్ పిట్‌ల అభ్యాసాన్ని GHMC ప్రోత్సహిస్తోందని మేము తెలుసుకున్నాము. ఈ విషయమై చర్చించి ఈ ప్రాజెక్టుకు కొంత నిధులు కేటాయించాలని జనరల్ బాడీని సంప్రదించాం. గత సెప్టెంబర్‌లో మాకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి రూ.2లక్షల ఫండ్ ఇచ్చారు. వెంటనే మేము పనిని ప్రారంభించాం. ఎండిన ఆకులను నిల్వ చేయడానికి 10 ఆరు అడుగుల గుంతలను తవ్వాము. ప్రతి నెలా కాలనీలోని ఇంటి నుంచి ఎండిన ఆకులు తీసుకురావడానికి ఓ రిక్షాను నియమించాము. ఆకులను సేకరించి తీసుకువచ్చి గుంతల్లో వేసి ఆ తరువాత ఆవు పేడను కలిపాం. రెండు నెలల తరువాత ఎరువు రావడం మొదలైందని అని రావు చెప్పారు.
భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాలనీ ప్రయత్నానికి చాలా ప్రోత్సాహాన్ని అందించింది. సాకేత్ కాలనీ ప్రయత్నాన్ని స్థానిక మున్సిపాలిటీలు, ప్రభుత్వం గుర్తించింది. సాకేత్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సుస్థిరతను సృష్టించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రతి ఒక్క పౌరుడు పాల్గొని మార్పును అమలు చేసినప్పుడు మాత్రమే గుర్తించదగిన ప్రభావం కనిపిస్తుంది.
మీ ఇంట్లోనే ఎండు ఆకుల నుండి సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలి
సాధారణంగా తోటల్లో ఆకులు సేకరించి వాటిని కాల్చివేయడం లేదా బయటకు పారవేయడం చేస్తుంటారు. అయితే.. ఇలా చేసే బదులు వీటిని కంపోస్ట్ ఎరువుగా మార్చిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ కంపోస్ట్ ఎరువు మొక్కల ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులు ఎండు ఆకుల నుండి ఎరువును ఉత్పత్తి చేసి మొక్కలకు ఉపయోగిస్తున్నారు.
ముందుగా ఎండు ఆకులను సేకరించండి. వీటిని ఒక పెద్ద బకెట్ లేదా ప్లాస్టిక్ సంచిలో సగం వరకు నింపండి. ఆపై మిగిలిన ఖాళీని నీటితో నింపండి. అలా రోజు నీటిని పోస్తూ ఉండాలి. అవసరం అనుకుంటే పుల్లటి మజ్జిగను కూడా పోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆకులు తొందరగా కుళ్లిపోతాయి. ఇలా చేయడం వల్ల రెండు మూడు నెలల్లో ఇది కంపోస్ట్ ఎరువుగా మారుతుంది.
మొక్కలలో పొడి ఆకులను ఎలా ఉపయోగించాలి
మీరు ఎండిన ఆకులను కంపోస్ట్ చేయలేకపోతే, మీరు వాటిని నేరుగా ఉపయోగించవచ్చు. ఎండిన ఆకులను మీ చేతులతో చూర్ణం చేసి పొడిని తయారు చేసి, ఆపై చెట్లపై, మొక్కలపై చల్లుకోండి. ఆ తరువాత వాటిపై నీరు పోయండి.