ఆస్పత్రిలో 10 రోజుల చికిత్స కోసం రూ.54 లక్షల బిల్లు.. హైదరాబాద్‌లో ఘటన
Rs 54 lakh bill for 10 day treatment at hospital in Hyderabad. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి విపరీతంగా వసూలు చేస్తున్న ఘటన
By అంజి Published on 23 Jan 2023 11:30 AM ISTహైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి విపరీతంగా వసూలు చేస్తున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ షేర్ చేసిన ఆసుపత్రి బిల్లు ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో 10 రోజుల చికిత్స కోసం సయ్యద్ రహ్మత్ ఉద్దీన్ అనే రోగి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశారు. రోగి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు రూ.20 లక్షలు చెల్లించారని అమ్జద్ ఉల్లా ఖాన్ పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. ఆసుపత్రి ఇంకా రూ. 29 లక్షలు డిమాండ్ చేస్తుందని పేర్కొన్న ఖాన్, రోగిని గాంధీ లేదా నిమ్స్ ఆసుపత్రికి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అభ్యర్థించారు.
.@TelanganaCMO Sir, Very strange that a patient Syed Rahmath Uddin has been charged Rs/ 54.0 lakhs by Citizen Hospital,Nallagandla, Serillingampally for 10 days,family paid Rs/ 20.0 lakhs till now./1@KTRTRS @cyberabadpolice @trsharish @pschandnr_cyb @KTRoffice @VijayGopal_ pic.twitter.com/9tnLbpdaup
— Amjed Ullah Khan MBT (@amjedmbt) January 22, 2023
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో వసూలు
ఇది మొదటిసారి కాదు.. ఇంతకుముందు కూడా హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రు కోవిడ్ చికిత్స పేరుతో అధిక బిల్లులు వసూలు చేశాయి. సామాన్య రోగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు గుంజాయి. ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ 44 ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ చికిత్స సమయంలో ఎక్కువ వసూలు చేసిన రోగులకు డబ్బును వాపసు చేయాల్సిందిగా కోరింది. వాటిలో నాలుగు ఆసుపత్రులు ఒక్కొక్కటి 10 లక్షలకు పైగా తిరిగి ఇచ్చాయి. ఎనిమిది ఆసుపత్రులు దాదాపు రూ. 5 లక్షలు, 10 లక్షలు, ఐదు ఆసుపత్రులు రూ. 3.2 లక్షల నుండి రూ. 399440 వరకు ఉన్న మొత్తాలను తిరిగి ఇచ్చాయి. ఆర్టీఐ ప్రత్యుత్తరం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 22, 2021 నాటికి రోగులకు మొత్తం రూ.1,61,22,484 తిరిగి ఇవ్వబడింది.
హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు
సాధారణంగా మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చులకు భయపడి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులను వచ్చేందుకు వెనుకాడుతున్నారు. రోగులు ఎలాంటి ఆరోగ్య బీమా పరిధిలోకి రాకపోతే ఆసుపత్రుల వద్ద వారి సమస్య ప్రతికూలంగా మారుతోంది. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ.. ఎక్కడ డబ్బులు వసూలు చేస్తారో అన్న భయంతో రాలేకపోతున్నారు.