ధనం మూలం ఇదం జగత్ అంటుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు డబ్బు కోసమే పని చేస్తుంటాం అనేది కాదనలేని సత్యం. అలాంటి డబ్బు నడి రోడ్డుపై కనిపిస్తే ఏం చేస్తారా..? ఎవ్వరు చూడకుండా ఆనగదును తీసి జేబులో పెట్టుకునే వాళ్లు ఎందరో. అయితే.. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంఖ్యలో రూ.2వేల నోట్లు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. అదీ హైటెక్ సిటీ సమీపంలో. బుధవారం ఉదయం మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు పడేసి వెళ్లిపోయారు.
అవి నిజమైన నోట్లుగా భ్రమపడ్డ జనం వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు. స్థానికులు, వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకునేందుకునేందుకు ఎగబడ్డారు. తీరా చూస్తే అవి ఫేక్‌నోట్లుగా తేలడంతో ఊసూరుమన్నారు. నోట్ల కోసం జనం ఎగబడడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న నకిలీ రూ.2వేల కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఆ నోట్లను పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగిస్తారని తెలిసింది. ఆ రూ.2వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని రాసి ఉంది. పండగ సమయంలో తమ పంట పడింది అనుకున్న జనం అసలు విషయం తెలుసుకుని వాటిని పడేసి నిరాశతో వెళ్లారు.