Hyderabad: ఎల్బీనగర్‌లో మరో కొత్త ఫ్లైఓవర్‌.. త్వరలోనే అందుబాటులోకి..

ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ ఫ్లైఓవర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

By అంజి  Published on  7 March 2023 4:16 AM GMT
Hyderabad, LB Nagar, RHS flyover

Hyderabad: ఎల్బీనగర్‌లో మరో కొత్త ఫ్లైఓవర్‌

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ (కుడి వైపు) ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. రద్దీగా ఉండే ఎల్‌బి నగర్ స్ట్రెచ్‌లో ట్రాఫిక్ మరింత సులభతరం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా అభివృద్ధి చేసిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ కారణంగా ఎల్‌బీ నగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం నిలిచిపోయిందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. 960 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ మూడు లేన్‌లతో నిర్మించబడింది. ఎల్‌బి నగర్ జంక్షన్ మీదుగా ఎల్‌బి నగర్‌లోని హయత్‌నగర్, వనస్థలిపురం, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అవాంతరాలు లేని ప్రయాణం అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

"ఫ్లైఓవర్ ప్రారంభించిన తర్వాత.. ప్రజలకు రద్దీగా ఉండే ఎల్‌బి నగర్ జంక్షన్, ట్రాఫిక్ సిగ్నల్ల వేచి ఉండే పరిస్థితి ఉండదు. నేరుగా ఎల్‌బి నగర్‌లోని కాలనీలకు ప్రయాణించవచ్చు" అని అధికారి తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డిసి) చైర్మన్, ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఎల్‌బి నగర్ నియోజకవర్గం మౌలిక సదుపాయాల పరంగా పెద్ద మార్పును సంతరించుకుందన్నారు. గత కొన్నేళ్లుగా ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టుల్లో భాగంగా ఎల్‌బి నగర్ నియోజకవర్గంలో చింతలకుంట అండర్‌పాస్‌తోపాటు నాగోలు, కామినేని ఆసుపత్రి, బైరామల్‌గూడలో ఫ్లైఓవర్‌లను నిర్మించినట్లు తెలిపారు.

గత ఎనిమిదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా ప్రయాణ కష్టాలు బాగా తగ్గాయని, ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నామని ఎల్‌బి నగర్ వాసులు తెలిపారు.

''ఈ ఫ్లైఓవర్ నాలాంటి అనేకమందికి ఉపయోగపడుతుంది. ఎల్‌బి నగర్‌లోని హయత్‌నగర్, వనస్థలిపురం, ఇతర నివాస ప్రాంతాలకు చేరుకోవడానికి మేము రద్దీగా ఉండే ఎల్‌బి నగర్ జంక్షన్, ట్రాఫిక్ సిగ్నల్‌లను దాటవేయవచ్చు. మా ప్రాంతంలోని ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల వల్ల ప్రయాణ సమయం, దూరం బాగా తగ్గిపోయాయి'' అని కొత్తపేటలోని అల్కాపురి కాలనీకి చెందిన సాయి రాజ్ అన్నారు.

Next Story