హైదరాబాద్‌లో కేసీఆర్‌ పాలనను.. తాలిబన్ పాలనతో పోలుస్తూ.. ఆర్జీవీ వరుస ట్వీట్లు

RGV's series of tweets comparing KCR's rule with Taliban's rule in Hyderabad. నిత్య వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర లేపాడు. ఈ సారి ఏకంగా ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశాడు.

By అంజి  Published on  13 Oct 2022 12:41 PM IST
హైదరాబాద్‌లో కేసీఆర్‌ పాలనను.. తాలిబన్ పాలనతో పోలుస్తూ.. ఆర్జీవీ వరుస ట్వీట్లు

నిత్య వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర లేపాడు. ఈ సారి ఏకంగా ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశాడు. హైదరాబాద్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నో మ్యూజిక్ ఆఫ్టర్ 10' పాలసీపై దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. సాధారణంగా రాత్రి వేళల్లో వ్యంగంతో కూడిన ట్వీట్లు చేసే వర్మ.. ఇవాళ ఎందుకో ఉదయం నుంచే వరుస ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్, మంతి కేటీఆర్‌ను టచ్‌ చేసుకుంటూ ట్వీట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనను తాలిబన్‌ పాలనతో పోలుస్తూ ట్విటర్‌లో వరుస విమర్శలు చేశారు.

''కేసీఆర్‌ గారూ, కేటీఆర్‌ గారూ, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గారూ.. రాత్రి 10 గంటల తర్వాత పబ్‌లలో మ్యూజిక్ ప్లే చేయకూడదనే నిబంధన తీసుకురావడంతో పబ్ శ్మశాన వాటికను తలపించింది. అప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? తాలిబన్ల తరహాలో హైదరాబాద్ నగరాన్ని పాలిస్తున్నారని నాకు తెలియలేదు'' అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఇంకా.. మనమందరం భారతదేశం అనే ఒకే దేశంలో నివసిస్తున్నప్పుడు హైదరాబాదీలు మాత్రమే తాలిబాన్‌ పాలనకు ఎందుకు గురవుతున్నారు సార్? దేశంలో అన్ని చోట్లా నో మ్యూజిక్ ఆఫ్టర్ 1 ఉంటే.. హైదరాబాద్‌లో 'నో మ్యూజిక్' పాలసీ రాత్రి 10 గంటలకు ఎలా వర్తిస్తుంది అంటూ ప్రశ్నించారు.

రోజంతా కష్టపడి పని చేసిన తర్వాత యువత చిన్నపాటి ఆనందాన్ని పొందేందుకు వీలు లేకుండా 'నో మ్యూజిక్' పాలసీ తీసుకురావడం తాలిబాన్ లాగా అనాగరికంగా ఉందన్నారు. తాను సౌండ్ పొల్యూషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ని కేస్ టు కేస్ ప్రాతిపదికన అర్థం చేసుకోగలను. కానీ అన్ని ఏరియాల్లో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ ప్లే చేయకూడదని రూల్స్‌ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. యాక్సిడెంట్లు అవుతున్నాయని ట్రాఫిక్ బ్యాన్ చేస్తారా?. సౌండ్ లేకుండా థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తారా? అంటూ ప్రభుత్వాన్ని ఆర్జీవీ ప్రశ్నించారు.

వరుస ట్వీట్‌ చేస్తూ.. 'నో మ్యూజిక్ ఆఫ్టర్ 10' పాలసీ విషయంలో కొన్ని లాజిక్స్ బయటకు లాగారు. కొన్ని ప్రమాదాలు జరిగాయని ట్రాఫిక్ బ్యాన్ చేస్తామా?. కొన్ని ఘటనలు జరిగాయని రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ప్లే చేయకపోవడం కూడా అంతేనని ఆర్జీవీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పబ్‌ల వద్ద నిఘా పెట్టే పోలీసులు.. అక్కడ ఉన్న యువత, పబ్ నిర్వాహకులను ఏదో నేరస్తులన్నట్లుగా చూస్తున్నారు. ఈ వైఖరి మారాలని, వారికి ఫ్రెండ్లీ పోలీస్ అనే బిరుదు లభించాలని కోరుకుంటున్నాను'' అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. పబ్ లో పది గంటల తర్వాత మ్యూజిక్ ఆపేయడంతో ఫారినర్స్ రియాక్షన్ తాను ఇంకా మార్చిపోలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ఆర్జీవీ అన్నారు.



Next Story