గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని రహదారులపై ప్రయాణించే వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. కార్లు, ఇతర వాహనాలు (సరుకు రవాణా వాహనాలు, బస్సులు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు) రెండు కేటగిరీలుగా విభజించి వేరువేరుగా పరిమితులను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నోటిఫికేషన్ మేరకు..డివైడర్ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 60 కి.మీ గా, ఇతర వాహనాల వేగం 50 కి.మీ గా నిర్ధారించారు. డివైడర్ లేని రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 50 కి.మీ గా, ఇతర వాహనాల వేగం 40 కి.మీ.గా, కాలనీ రోడ్లపై కార్ల గరిష్ట వేగం 30 కి.మీగా, ఇతర వాహనాల గరిష్ట వేగం 30 కి.మీ.గా ఖరారు చేసింది. అయితే.. సైనిక సేవలో ఉన్న వాహనాలకు ఈ వేగ పరిమితులు వర్తించవని నోటిఫికేషన్‌లో తెలిపింది.
ఇదిలా ఉంటే.. గతంతో పోల్చితే గ్రేటర్ వ్యాప్తంగా ప్రధానరోడ్లతోపాటు అంతర్గత రహదారులు మెరుగుపడ్డాయి. అవసరమున్నచోట్ల బీటీ, వీడీసీసీ, సీసీ రోడ్ల ను నిర్మించడంతో జీహెచ్ఎంసీ, పోలీసు, రవాణా శాఖ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించింది. వాహన వేగానికి సరిపడేలా రోడ్లు డిజైన్ చేయడంతో వేగం పెరిగినా వాహనదారుడు సురక్షితంగా గమ్యం చేరేందుకు వేగపరిమితిని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.