కరోనా ఎఫెక్ట్‌.. హోలీ వేడుకలపై హైద‌రాబాద్‌‌లో ఆంక్ష‌లు.. అతిక్రమిస్తే..

Restrictions on holi festival in Hyderabad.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2021 7:50 AM GMT
కరోనా ఎఫెక్ట్‌.. హోలీ వేడుకలపై హైద‌రాబాద్‌‌లో ఆంక్ష‌లు.. అతిక్రమిస్తే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో హోలీ వేడుక‌ల‌పై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్ప‌ష్టం చేశారు. కొవిడ్ కేసులు విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్ల‌డించారు. ఒక‌వేళ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు గేటెడ్ కమ్యూనిటీల వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టల్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా మాస్క్ లు, భౌతిక దూరం పాటించాలన్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని, ద్విచక్రవాహనాలు, కార్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రేపు, ఎల్లుండి వైన్స్‌ షాపులు బంద్..

హోలీ పండుగ సందర్భంగా రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో హోలీని నిషేధించారు. మహారాష్ట్రలో ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిషేధం ఉంది. 20 మంది కంటే ఎక్కువ గుమికూడవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. హోలీ వేడుకలకు ప్రభుత్వ అనుమతులు త‌ప్పనిసరని.. అనుమతి లేకుండా హోలీ నిర్వహిస్తే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చింది. మరిన్ని రాష్ట్రాలు కూడా నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీలో మాత్రం కొవిడ్ నిబంధనలకు లోబడి వేడుకలను జరుపుకోవచ్చని అధికారులు తెలిపారు.




Next Story