ప్రభుత్వ పెట్టుబడులతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వృద్ధి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
By - అంజి |
ప్రభుత్వ పెట్టుబడులతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వృద్ధి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నాడు హైటెక్స్‌లో జరిగిన NAREDCO (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) 15వ సమావేశంలో డీప్యూటీ సీఎం మాట్లాడారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని అణగదొక్కడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ వేలంలో ఎకరం రూ.177 కోట్లు పలికిందంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవాలన్నారు. సీవరేజ్ ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం సుమారు రూ.13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇతర ఏ నగరంలో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా హైదరాబాద్ నగరంలోనే జరుగుతోందని అన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు కల్పించామని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయన్నారు.
విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలన్న డిప్యూటీ సీఎం.. నెరెడ్కో ప్రతినిధులు తమ CSR నిధులను విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో వినియోగించాలని సూచించారు. విల్లాలు, హై రైజ్ భవనాలకే పరిమితం కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సంపద సృష్టికర్తలుగా రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.