Hyderabad: రామ నవమి శోభాయాత్ర.. మసీదు, దర్గాకు క్లాత్ కప్పారు
మార్చి 30న చేపట్టనున్న శ్రీరామ నవమి శోభయాత్రకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
By అంజి Published on 29 March 2023 11:05 AM ISTసిద్దిఅంబర్ బజార్ మసీదు క్లాత్‌తో కప్పబడి ఉంది
హైదరాబాద్: మార్చి 30న చేపట్టనున్న శ్రీరామ నవమి శోభయాత్రకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఊరేగింపుకు ముందు సిద్దిఅంబర్ బజార్ మసీదు, దర్గాను క్లాత్‌తో కప్పారు. ప్రస్తుతం బిజెపి నుండి సస్పెండ్ చేయబడిన గోషామహల్ వివాదాస్పద ఎమ్మెల్యే టి రాజా సింగ్ మార్చి 30 న హైదరాబాద్‌లో రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించనున్నారు. తన ట్విట్టర్‌లో ఊరేగింపులో చేరాలని 'రామ-భక్తులందరినీ ఆహ్వానిస్తూ తన వీడియోను కూడా రాజాసింగ్ పంచుకున్నారు. ఇక అన్ని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును పోలీసులు పర్యవేక్షించనున్నారు.
మార్చి 30వ తేదీ ఉదయం 9 గంటలకు సీతారాంభాగ్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమై అదే రోజు రాత్రి 7 గంటలకు కోటిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగుస్తుంది. ఊరేగింపు భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట్ పురానాపూల్ రోడ్, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి కూడలి, కోటి మీదుగా సుల్తాన్ బజార్ మీదుగా సాగుతుంది. హనుమాన్ వ్యామశాల వద్ద ఆగుతుంది. హైదరాబాద్‌లో శ్రీరామనవమి యాత్రను పురస్కరించుకుని సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. నిర్దేశిత మార్గం గుండా వెళ్లినప్పుడు ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.