హైదరాబాద్: బుల్లెట్ రెసిస్టెంట్ వాహనాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌ను శుక్రవారం ప్రగతి భవన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం మంగళ్‌హాట్ వద్ద ఎమ్మెల్యే వాహనంలో ఇంటికి వెళ్తుండగా ఆయనకు కేటాయించిన బుల్లెట్ రెసిస్టెంట్ స్కార్పియో టైర్ ఒకటి పాడైంది. శుక్రవారం రాజా సింగ్ తన వాహనంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాసం-క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌కు వెళ్లి కారును అక్కడ వదిలి వెళ్లారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం పదే పదే చెడిపోతోందని, ఎన్నిసార్లు మోర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ అన్నారు.
కారు అక్కడ వదిలి వెళ్లిపోతుండగా పోలీసులు రాజాసింగ్‌ని అదుపులోకి తీసుకుని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు. పోలీసులు ఆయనను తెలంగాణ శాసనసభ వద్ద దింపారు. ప్రవక్త వ్యాఖ్యల కేసులో ప్రివెంటివ్ డిటెన్షన్ (పిడి) చట్టం కింద విధించిన జైలుశిక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన తర్వాత బిజెపి ఎమ్మెల్యే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఇంతకుముందు, రాజా సింగ్ వాహనంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరమ్మతుల కోసం తీసుకెళ్లాల్సి వచ్చింది. నిన్నటి రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. స్పీడ్ తక్కవగా ఉండటంతో ఎవరికి ఏమి కాలేదు. దీంతో ఎమ్మెల్యే తన కారును కూడా మార్చాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్‌కు 2+2 రౌండ్-ది-క్లాక్ భద్రత, బుల్లెట్ ఫ్రుఫ్ వాహనం అందించబడింది.