హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్లు జ‌ల‌మ‌యం

Rain in Several places in Hyderabad.హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో గురువారం మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 6:49 AM GMT
హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్లు జ‌ల‌మ‌యం

హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో గురువారం మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసింది. న‌గ‌రంలోని శంషాబాద్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, అత్తాపూర్‌, క‌స్మిత్‌పూరా, గండిపేట్‌, ఆరాంఘ‌ర్‌, మ‌ణికొండ‌, నార్సింగి ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, వెంగల్‌రావునగర్‌, మైత్రివనం, నాంపల్లి, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పూర్‌, దోమలగూడ, గాంధీనగర్‌, జవహర్‌నగర్‌, మియాపూర్‌, చందానగర్‌, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, యూస‌ఫ్ గూడ‌, గాంధీన‌గ‌ర్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది.

పాతబ‌స్తీ, చంద్రాయ‌ణగుట్ట‌, ఫ‌ల‌క్‌నుమా, బార్కాస్‌, మియాపూర్‌, చందాన‌గ‌ర్‌, మ‌దీనాగూడ‌, మ‌దాపూర్, గ‌చ్చిబౌలి,రాయ‌దుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో ప‌డిన వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహ‌న‌దారులు మెట్రో పిల్ల‌ర్ల కింద నిరీక్షించాల్సి వ‌చ్చింది.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుందని, దీని ప్రభావంతో నేడు హైద‌రాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఈ నెల 25 వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు వాన‌లు కురిసే వీలుంద‌ని తెలిపింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించింది.

Next Story
Share it