హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్‌బాబు కేసుపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పందించారు. దర్యాప్తు కొనసాగుతోందని, సీనియర్ నటుడికి నోటీసులు అందజేశామని సుధీర్ బాబు తెలిపారు. డిసెంబర్ 24 వరకు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాకుండా మోహన్‌బాబుకు తెలంగాణ హైకోర్టు మినహాయింపునిచ్చిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను శిరసావహిస్తాం.. ఆ తర్వాత స్పందన రాకపోతే మరోసారి మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేస్తామని సీపీ చెప్పారు.
ఆయన అరెస్టు విషయంలో ఆలస్యం లేదని తెలిపారు. ఈ నెల 24 వరకు సమయం అడిగారని చెప్పారు. 24 లోపు విచారించడంపై కోర్టును అనుమతి కోరుతామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మోహన్‌బాబుకి గన్ లైసెన్స్ లేదని తెలిపారు. మోహన్ బాబు దగ్గర రెండు తుపాకులు ఉన్నట్లు సమాచారం అందిందని, నటుడికి అందజేసిన నోటీసులలో, మోహన్ బాబు తన రెండు తుపాకీలను అతనికి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్లలో ఎక్కడైనా డిపాజిట్ చేయాలని తాము కోరామని తెలిపారు. మంచు కుటుంబంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు.
అటు నటుడు మోహన్ బాబు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి చేరుకున్నారు. అనంతరం చంద్రగిరి పీఎస్‌లో తన లైసెన్స్‌డ్ గన్‌ను పీఆర్‌వో ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవల గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ను ఆదేశించడంతో తాజాగా గన్ అప్పగించారు.