హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా సాగుతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బోనాల జాతరలో పాల్గొన్నారు. స్వయంగా బోనమెత్తి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గత సంవత్సరం టోర్నమెంట్ కారణంగా రాలేకపోయింది. ఈ సారి అమ్మవారికి సింధు బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా సింధును ఆలయ కమిటీ సత్కరించింది.
తనకు హైదరాబాద్ బోనాల పండుగ అంటే చాలా ఇష్టమని సింధు చెప్పారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటానన్నారు. అమ్మవారికి బోనం సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, ఇక నుంచి తప్పకుండా ప్రతి ఏటా బోనాల ఉత్సవంలో పాల్గొంటానని పీవీ సింధు చెప్పారు. ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి వున్నారు. క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.