Hyderabad: నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!
భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్ (27)ను నార్సింగి పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
By అంజి Published on 2 Dec 2024 7:46 AM ISTHyderabad: నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!
హైదరాబాద్: జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ తెలివితేటలు చూసి జైలు అధికారులు సైతం ఆశ్చర్యచకితులయ్యారు. అతడు నకిలీ బెయిల్ పత్రాలను సృష్టించడమే కాదు ఏకంగా అధికారులను సైతం నమ్మే విధంగా వ్యవహరించాడు.. దీంతో అతడికి నిజంగానే బెయిల్ వచ్చిందని నమ్మిన జైలు అధికారులు అతన్ని వదిలేశారు. ఖైదీ జైలు నుండి బయటకు వెళ్లిన అనంతరం జైలు అధికారులు అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్ (27)ను నార్సింగి పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత అతడు బెయిల్ కోసం ప్రయత్నించాడు. బెయిల్ రాకపోవడంతో జైలు నుండి పరార్ కావాలని స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే అతడు ఫేక్ బెయిల్ పత్రాలను జైలు అధికారులకు ఇచ్చి గత నెల 26న బయటకు వచ్చాడు. కానీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో అవి నకిలీవని గుర్తించి జైలు అధికారులు కంగుతిన్నారు. ఇప్పుడా ఖైదీ కోసం జైలు అధికారులు వెతికే పనిలో పడ్డారు.
రెండు నెలల క్రితం 18 మంది సభ్యులతో కలిపి సుజాతలి ఖాన్‌ను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో సుజాయత్ అలీని కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ నార్సింగ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు... కోర్టు సుజాతలి ఖాన్‌ని కస్టడీ లోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు... అయితే అక్కడ ఉన్న జైలు అధికారులు జైల్లో లేని సుజాతలి ఖాన్‌కి కస్టడీ ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
కొన్ని రోజుల క్రితమే సుజాతలి ఖాన్ జైలు నుండి బెయిల్ పై విడుదలై వెళ్ళిపోయాడని అధికా రులు వెల్లడించారు. అయితే జైలు అధికారులు మరోసారి బెయిల్ పత్రాలను తనిఖీ చేయగా అవి నకిలీవని తేలడంతో ఒక్కసారిగా కంగుతున్నారు.. దీంతో జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై సుజాతలి ఖాన్ రిమాండ్ ఖైదీ పరార్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.