రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి బొల్లారం వద్ద సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన, బస ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం సమీక్షించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. అధికారులు సమిష్టిగా కృషి చేసి ఏర్పాట్లను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
రాష్ట్రపతి నిలయానికి రాకపోకలు సజావుగా సాగేలా రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్‌లు ప్రారంభించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోను ఆదేశించారు. 24 గంటల కరెంటు సరఫరా చేసేలా చూడాలని విద్యుత్ శాఖను, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య శాఖను, రాష్ట్రపతి భవన్ ప్రోటోకాల్ ప్రకారం ఇతర శాఖలు ఏర్పాట్లు చేయాలని సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను, నగరానికి ప్రపంచ గుర్తింపును పెంచేందుకు రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను ఒక అవకాశంగా భావించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు. దీంతో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని.. రాష్ట్రపతి పర్యటన వీలైనంత సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు