హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. గొప్ప పూర్వ విద్యార్థులను తయారు చేసినందుకు హెచ్‌పీఎస్‌ని ప్రశంసించారు.

By అంజి  Published on  19 Dec 2023 1:44 PM IST
President Draupadi Murmu, Hyderabad Public School, centenary celebrations, Hyderabad

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి

హైదరాబాద్‌: దేశంలోని పురాతన విద్యాసంస్థల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఒకటి. విద్యారంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న బేగంపేటలోని హెచ్‌పీఎస్‌ 2023నాటికి వందేళ్లకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది పొడువునా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఈ శతాబ్ది ఉత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. గొప్ప పూర్వ విద్యార్థులను తయారు చేసినందుకు హెచ్‌పీఎస్‌ని ప్రశంసించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందని ముర్ము అన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్‌లో చదివిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు లాంటి అనేకమంది గొప్పవాళ్లు ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారని అన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. హెచ్‌పీఎస్‌ విద్యార్థుల ప్రతిభతో భారతదేశ గౌరవం కూడా పెరుగుతూ వస్తోందన్నారు. పాఠశాలలోని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్న రాష్ట్రపతి.. విద్యార్థులు పర్యావరణం, ప్రకృతి పైన అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులందరూ కేవలం తమ స్వార్ధ ప్రయోజనాలు కాకుండా వేరే వారికి సహాయపడే అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వారి జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని ముర్ము సూచించారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు పకడ్బందీ గస్తీ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నివాస ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి సోమవారం సాయంత్రం నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. 5 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోనే బస చేయనున్నారు.

Next Story