హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోని రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో.. ఆయన ఆరోగ్యం కోసం యజ్ఞం చేసినట్లు నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ తార్నాక లోని లక్ష్మీ గణపతి ఆలయంలో.. కేసీఆర్ ఆరోగ్యం కోసం నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉక్కుమనిషిగా పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి సుమారుగా 20 సంవత్సరాలుగా కెసిఆర్ వెన్నంటే ఉండి పోరాటం చేశామని.. ఆయనకు కరోనా వైరస్ సోకిన విషయం తెలియగానే చాలా కలత చెంది ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కరోనా బారి నుండి త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర టిఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.