Modi Posters : మోదీ గారు.. ఫ్లైఓవర్ ఇంకెన్నాళ్లూ..? ఉప్ప‌ల్‌లో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

ఉప్ప‌ల్‌-నార‌ప‌ల్లి ఫ్లై ఓవ‌ర్ నిర్మాణంలో జాప్యంపై మోదీకి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు అంటించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2023 6:15 AM GMT
Uppal elevated corridor, Pm Modi

ఉప్ప‌ల్‌లో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇటీవ‌ల కాలంలో పోస్ట‌ర్లు క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఉప్ప‌ల్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోస్ట‌ర్లు వెలిశాయి. ఉప్ప‌ల్‌-నార‌ప‌ల్లి ఫ్లై ఓవ‌ర్ నిర్మాణంలో జాప్యంపై మోదీకి వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు అంటించారు.

"మోదీ గారు.. ఈ ఫ్లై ఓవ‌ర్ ఇంకా ఎన్ని సంవ‌త్స‌రాలు క‌డ‌తారు..? 2018 మే 5న ఈ ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌ను ప్రారంభించారు. ఐదేళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం ప‌నులు కూడా పూర్తి కాలేదు. తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాం.. "అని ఆ పోస్ట‌ర్ల‌లో ముద్రించారు. ఈ పోస్ట‌ర్ల‌ను మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ఫ్లై ఓవ‌ర్ల పిల్ల‌ర్ల‌కు అన్నింటికి అంటించారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.

ఉప్ప‌ల్ వ‌రంగ‌ల్ హైవేపై ఉప్ప‌ల్ నుంచి మేడిప‌ల్లి మ‌ధ్య ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు భార‌త్ మాల ప‌థ‌కం కింద 6.2 కిలోమీట‌ర్ల దూరంతో రూ.626.80 కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం చేప‌ట్టారు. 2018లో మేలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఈ ఫ్లై ఓవ‌ర్‌కు శంకుస్థాప‌న చేశారు. జూలైలో ప‌నులు ప్రారంభం అయ్యాయి. 2020 జూన్ వ‌ర‌కు నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నా.. ఇంకా పూర్తి కాలేదు.

ఈ ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై మంత్రి కేటీఆర్ దృష్టికి ఓ నెటీజ‌న్ తీసుకువెళ్ల‌గా మంత్రి రెస్పాండ్ అయిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ప్ర‌భుత్వానికి, మోదీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉన్న తేడా ఇదేనంటూ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Next Story