Hyderabad: టెస్ట్‌ ట్యూబ్‌ ముసుగులో దారుణం.. వెలుగులోకి కొత్త విషయాలు

సంతానం కోసం టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌కు వెళ్లిన దంపతులను మోసం చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By అంజి
Published on : 27 July 2025 7:07 AM IST

Hyderabad, Police, register case, fertility center, cheat, couple, surrogacy

Hyderabad: టెస్ట్‌ ట్యూబ్‌ ముసుగులో దారుణం.. వెలుగులోకి కొత్త విషయాలు

సంతానం కోసం టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌కు వెళ్లిన దంపతులను మోసం చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వీర్యం సేకరణ, ఐవీఎఫ్‌, సరోగసీ విధానం తదితర అంశాలను పోలీసులు గుర్తించారు. 7 ఏళ్ల కిందటే ఈ కేంద్రాన్ని సీజ్‌ చేసినా రహస్యంగా నడుపుతున్నట్టు సమాచారం. వైద్యురాలి లైసెన్స్‌ రద్దు చేసినా.. మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు కాగానే డాక్టర్‌ నమ్రత విజయవాడ వెళ్లిపోగా.. పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆమెకు కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం తదితర చోట్ల సెంటర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అక్కడ కీలక ఆధారాలు, పెద్ద మొత్తంలో వీర్యం నిల్వలు సీజ్‌ చేసినట్టు సమాచారం.

అసలు ఏం జరిగిందంటే?

రాజస్థాన్‌కు చెందిన దంపతులు నాలుగేళ్లు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. మూడేళ్ల కిందట ఈ జంట సంతానలేమి సమస్య కారణంగా యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారు. అయితే పిల్లల కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు భర్త కాకుండా వేరే వారి వీర్య కణాలతో గర్భధారణ చేశారు. ఇటీవల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలుడు తరచూ అనారోగ్యానికి గురవుతుండగా.. టెస్టులు చేయించారు. ఈ టెస్టుల్లో బాలుడికి క్యాన్సర్‌ ఉన్నట్టు తేలింది. కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్‌ లేకపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు చేయించగా అసలు విషయం బయటపడింది. బాధితులు గోపాలపురం పోలీసులు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story