ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 24 మందికి నోటీసులు
ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నలుగురు పబ్ ఓనర్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
By అంజి Published on 8 July 2024 2:15 PM ISTది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 24 మందికి నోటీసులు
హైదరాబాద్: ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నలుగురు పబ్ ఓనర్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీకెండ్‌లో జరిగిన పార్టీలో ఇద్దరు డిజేలు పాల్గొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న డి.జే గౌరాంగ్, సందీప్‌ల డ్రగ్స్ లింక్స్‌పై నార్కోటిక్ బ్యూరో ఆరా తీస్తోంది. పబ్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారిలో బిజినెస్ మేన్, టెక్కీలు, ఆర్టిస్టులు.. కాలేజీ విద్యార్థులు ఉన్నారు. నార్కోటిక్ బ్యూరో.. ది కేవ్ పబ్ పై దాడులు చేసి.. పార్టీలో పాల్గొన్న 50 మందిని అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్స్ అనాలసిస్ పరీక్ష నిర్వహించారు. ఇందులో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది.
దీంతో నార్కోటిక్ బృందం 24 మంది గతంలో కూడా డ్రగ్స్ తీసుకున్నారా? లేదా?అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ది కేవ్ పబ్‌లో పట్టుబడ్డ 24 మందికి రాయదుర్గం పోలీసులు సీఆర్పీసీ 41కింద నోటీస్లు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ది కేవ్ పబ్ వ్యవహారంతో అప్రమత్తమైన నార్కోటిక్ బ్యూరో బృందం నగరంలో ఉన్న అన్ని పబ్స్ పై ఫోకస్ పెట్టింది. కచ్చితంగా ప్రతి రోజు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. కేవ్ పబ్‌ను సీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో బృందం గతంలో కేవ్ పబ్‌లో డ్రగ్స్ పార్టీలపై ఆరా తీస్తున్నారు.
పబ్ నిర్వాహకులు దొరికితే పబ్ బండారం బట్టబయలు అయ్యో అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జూబ్లీహిల్స్ పరిధిలో అన్ని పబ్బులు, బార్లలో డ్రగ్స్, మాదకద్రవ్యాల గురించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్, గంజాయిలాంటి మాదకద్రవ్యాల వాడకం పట్ల పబ్స్ యజమానులు ప్రోత్సహిస్తే.. అట్టి పబ్ యజమానులపై అత్యంత కఠిన చర్యలు తీసుకో వడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మాదకద్రవ్యాల గురించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే Dial100 కి కాల్ చేయండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.