హైదరాబాద్: సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసు శాఖ పలు హెచ్చరికలు జారీ చేసినట్టు కాంగ్రెస్ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ప్రతిరోజూ రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య వ్యాపారాలు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు.రోడ్లపై అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్‌లు ఇవ్వొద్దని, అర్థరాత్రుల్లో నగర రోడ్లపై లక్ష్యం లేకుండా తిరగవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దని, ఏదైనా నేర కార్యకలాపాలు గుర్తిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు పౌరులకు తెలియజేశారు. చట్టాన్ని ఉల్లంఘించవద్దని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. గంజాయి బ్యాచ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని సూచించారు.