9 ఏళ్లలో ప్రధాని ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదు: కవిత

PM Modi never held single press conference in nine years.. MLC Kavitha. హైదరాబాద్: గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదని

By అంజి  Published on  9 Jan 2023 3:43 AM GMT
9 ఏళ్లలో ప్రధాని ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదు: కవిత

హైదరాబాద్: గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదని తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం మండిపడ్డారు. పటాన్‌చెరులో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల రెండవ రాష్ట్ర స్థాయి సదస్సును ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇప్పటివరకు జర్నలిస్టులతో ఎలాంటి ప్రత్యక్ష సంభాషణలను చేయలేదన్నారు. అయితే ఎంపిక చేసిన ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చారని అన్నారు.

''మన దురదృష్టం ఏమిటంటే, గత తొమ్మిదేళ్లలో ప్రధాని ఒక్కసారి కూడా బహిరంగ విలేకరుల సమావేశం నిర్వహించలేదు. నాకు తెలిసినంత వరకు ఏ జర్నలిస్టు కూడా అతనిని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన (మోడీ) ఎంపిక చేసిన కొందరికి ఇంటర్వ్యూలు ఇస్తారు. కానీ, ఇక్కడ (తెలంగాణలో) మా ముఖ్యమంత్రి 300 నుండి 350 మంది జర్నలిస్టులతో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు'' అని కవిత అన్నారు.

ఒక నాయకుడు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్న కవిత.. ప్రధానమంత్రిని 'మీట్ ది ప్రెస్'కి ఆహ్వానించాలన్నారు. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ మాట్లాడుతూ.. ''మేము ప్రశ్నిస్తే రాజకీయంగా దుమ్మెత్తిపోసేలా పరిస్థితి తయారైంది. కానీ మీరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినప్పుడు అది తటస్థంగా ఉంటుంది.'' అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సమానంగా జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు మంజూరు చేయాలని ఆమె మోడీని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కవిత అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందని, కానీ కేంద్రం ఏనాడూ జర్నలిస్టుల గురించి పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎలాంటి గుర్తింపు లేని కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడంలో ముందున్నాయని కవిత అన్నారు. తెలంగాణ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.

Next Story