టీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ గూటికి పీజేఆర్ కూతురు.. మంచి భవిష్యత్తు కోసమేనంటూ
PJR's daughter Vijaya Reddy joins Congress.తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2022 6:26 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్ తగిలింది. ఖైరతాబాద్ కార్పొరేటర్, దివంగత నేత పీజేఆర్ కుమారై విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఈ క్రమంలో నేడు(శనివారం) ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విజయారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డితో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
మంచి భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా విజయారెడ్డి తెలిపారు. పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్‌లోకి వస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో అప్పగించిన బాధ్యతలను నిర్వహించినప్పటికి సరైన గుర్తింపు దక్కలేదన్నారు. టీఆర్ఎస్‌లో ఒక బౌండరీ గీస్తారని తెలిపారు. తన శక్తి సామర్థ్యాన్ని చాటాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన వేదిక అని బావించినట్లు విజయారెడ్డి చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ లో మహిళ మీద జరిగిన ఘటన గురించి కుడా మాట్లాడలేక పోవడం బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్ లో ఉంటే ఇలాంటి ఘటనల మీద గట్టిగా మాట్లాడగలమన్నారు. ఇక ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఇంకా హామీ ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదన్నారు.
గత కొంతకాలంగా విజయారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. 2018లో ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే.. ఆ సమయంలో కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు టికెట్ ఇవ్వడంతో అప్పటి నుంచి విజయారెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటును ఆశిస్తూ అధికార పార్టీలో కొనసాగారు. 2021లో జరిగిన గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్ గా గెలిచారు. మేయర్ సీటు తనకు వస్తుందని భావించారు. కానీ ఆ ఆశలు కూడా ఫలించలేదు. దీంతో టీఆర్ఎస్‌లో తన రాజకీయ జీవితం ఎదిగే అవకాశాలు లేనట్లుగా బావించిన విజయారెడ్డి కాంగ్రెస్‌లోకి చేరాలని నిర్ణయించుకున్నారు.