నా డబ్బులు పోయాయి. నా మెడలో చైన్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. నా సెల్‌ఫోన్ చోరికి గురైంది. మా చిన్నారి కనిపించడం లేదు అంటూ ఇలా చాలా రకాల కంప్లైంట్‌లు ఇవ్వడం చూసి ఉంటాం. అయితే.. నా పిల్లి ఎవరో ఎత్తుకెళ్లాడు. కాస్త వెతికి పెట్టండి అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఈ వింత కంప్లైంట్ హైదరాబాద్ వనసస్థలిపురం పోలీసులకు వద్దకు వచ్చింది.
వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహార్ మహమూద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు అరుదైన హౌ మనీ (Khow Manee) జాతికి చెందిన ఓ పిల్లిని రూ.50 వేలకు కొనుగోలు చేశాడు. కొంతకాలంగా దాన్ని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు. 18 నెలల వయస్సు ఉన్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లికి ఓ కన్ను గ్రీన్ కలర్‌లో, మరో కన్ను బ్లూ కలర్‌లో ఉంటుంది.
అయితే.. ఆదివారం రాత్రి ఇంటి ముందు ఉన్న పిల్లిని ఎవరో ఎత్తుకుపోయారు. దీంతో కలవరపాటుకు గురైన అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన పిల్లిని కనిపెట్టాలని పోలీసులకు కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఎవరో ఒక వ్యక్తి దాన్ని బైక్‌పై ఎత్తుకువెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని పట్టుకునే పనిలో పడ్డారు.