ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

PD ACT case registered against Goshamahal MLA Rajasingh. భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్

By అంజి  Published on  25 Aug 2022 12:10 PM GMT
ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళ్‌హాట్ పోలీసులు ఆగస్టు 25న పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చర్లపల్లి జైలుకు తరలించారు. టి.రాజాసింగ్‌ లోధ్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో పాటు, ప్రజా అశాంతికి దారితీసేలా వర్గాల మధ్య చీలిక తెస్తున్నాడని హైదరాబాద్‌ సిటీ పోలీసులు చెప్పారు. ఆగష్టు 22న.. రాజా సింగ్ 'శ్రీ రామ్ తెలంగాణ' అనే యూట్యూబ్ ఛానెల్‌లో వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోల అతను ప్రవక్త ముహమ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు.

అన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టి తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఆగష్టు 23న రాజా సింగ్‌ను అరెస్టు చేసినప్పుడు.. యూట్యూబ్ నుండి తన ప్రసంగాన్ని తొలగించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే తన తదుపరి ప్రసంగాలు, వీడియోలను పోస్ట్ చేయకుండా ఆపలేరని వ్యాఖ్యానించాడు. రాజాసింగ్‌ వీడియో వైరల్ కావడంతో.. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలలో, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి. వర్గాల మధ్య చీలికకు దారితీసింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి, చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 18 మత‌ప‌ర‌మైన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. పీడీయాక్టు న‌మోదుతో రాజాసింగ్‌కు బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. చాలాసార్లు ఒక‌మ‌తాన్ని, వ‌ర్గాన్ని కించ‌ప‌ర్చేలా రాజాసింగ్ వ్యాఖ్య‌లు చేశార‌ని సీపీ వెల్ల‌డించారు. రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి.

Next Story