హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం నంబర్ 6E-6151లో బాంబు ఉందని కాల్ రావడంతో.. వెంటనే ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేసి ప్రయాణికులందరినీ ఖాళీ చేయించారు. సీనియర్ సిటిజన్ అయిన ఓ ప్రయాణికుడు ఫ్లైట్‌ని అందుకోడానికి ఆలస్యమవడంతో బూటకపు కాల్ చేసినట్లు ఆ తర్వాత తేలింది.
RGI ఎయిర్‌పోర్ట్ పోలీసుల కథనం ప్రకారం, ఉదయం 10.30 గంటలకు, పోలీసు కంట్రోల్‌కి విమానంలో బాంబు ఉందని కాల్ వచ్చింది. దీంతో అధికారులు దానిని వెంటనే ఆపేశారు. బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC) సమావేశమై కాల్‌పై విచారణ జరిపింది.
విచారణలో కాప్రాలోని ప్రశాంత్ నగర్, ఈసీఐఎల్ నివాసి అజ్మీర్ భద్రయ్య (59) అనే వ్యక్తి చెన్నైకి ఇండిగో విమానం (6ఈ-6151) ను చేరుకోడానికి ఆర్‌జిఐ విమానాశ్రయానికి వచ్చినట్లు తేలింది. ఆలస్యంగా రావడంతో ఇండిగో ఉద్యోగి అతడిని విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. సదరు ప్రయాణికుడు ఉద్యోగితో వాగ్వాదానికి దిగి తనను విమానం ఎక్కేందుకు అనుమతించాలని కోరాడు. ఫ్లైట్‌లోకి ఎక్కలేకపోవడంతో ఆ ప్రయాణికుడు పోలీస్ కంట్రోల్ రూమ్ (డయల్ 100)కి బూటకపు కాల్ చేశాడు. బాంబు బెదిరింపు కాల్ వల్ల చాలా మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడిపై చర్యలు ప్రారంభించారు.