హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విమానంలో సిగరెట్ తాగుతున్న ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నివాసి అయిన గంగారామ్ వ్యక్తిగత పని కోసం దుబాయ్ వెళ్లి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E-1466లో తిరిగి వస్తున్నాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిషేధం విధించినప్పటికీ, అతను రహస్యంగా సిగరెట్లు మరియు లైటర్‌ను విమానంలోకి తీసుకెళ్లాడు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, అతను టాయిలెట్‌లోకి వెళ్లి సిగరెట్ తాగాడు. బయట పొగలు గమనించినప్పుడు, విమానయాన సిబ్బంది అప్రమత్తమై, అతని వస్తువులను తనిఖీ చేసి, సిగరెట్లు మరియు లైటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.