ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధం: నాగార్జున అక్కినేని
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటనపై స్పందించిన నటుడు నాగార్జున.. ఈ చర్య చట్ట విరుద్ధమని అన్నారు.
By అంజి Published on 24 Aug 2024 8:27 AM GMTఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధం: నాగార్జున అక్కినేని
హైదరాబాద్: మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటనపై స్పందించిన నటుడు నాగార్జున.. ఈ చర్య చట్ట విరుద్ధమని అన్నారు. శనివారం, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) బృందాలు భవనాన్ని ఆక్రమణగా పేర్కొంటూ కూల్చివేశారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో, నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను చట్టవిరుద్ధంగా కూల్చివేయడంపై తన బాధను వ్యక్తం చేశాడు. ''స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను'' అని నాగార్జున తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
''ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని'' అని నాగార్జున అన్నారు.
''తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను'' అని తెలిపారు.
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్ 10 ఎకరాల్లో విస్తరించి ఉండడం ఏళ్ల తరబడి చర్చనీయాంశంగా మారింది. ఎన్-కన్వెన్షన్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఆగస్టు 21న కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు లేఖ రాస్తూ, ఎఫ్‌టీఎల్ పరిధిలో ట్యాంక్ వాటర్ వైపు రిటైనింగ్ వాల్‌తో రక్షణ కల్పించి నిర్మించారని తెలిపారు. అసలు నేల మట్టం, తద్వారా కుంట యొక్క నీటి వ్యాప్తి ప్రాంతం తగ్గిందన్నారు.
తమ్మిడి కుంటలోని ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం 29.24 ఎకరాలు కాగా, ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాలు ఆక్రమించింది.