జస్ట్‌ మిస్‌: ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్‌బండ్‌ ఎన్టీర్‌ మార్గ్‌లో అదుపుతప్పింది.

By అంజి  Published on  30 July 2023 9:26 AM IST
hussain sagar, Hyderabad, ntr marg, Overspeed

జస్ట్‌ మిస్‌: ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం 

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్‌బండ్‌ ఎన్టీర్‌ మార్గ్‌లో అదుపుతప్పింది. ఆ వెంటనే హుస్సేన్‌సాగర్‌ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. కొద్దిలో హుస్సేన్‌సాగర్‌లో పడిపోయేది. అయితే కారులోని ఎయిర్‌ బెలున్స్‌ తెరచుకోవడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. ఆ తర్వాత వారు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కాగా, ప్రమాదం ధాటికి కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో కారును అక్కడినుంచి తరలించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నగర శివారులోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. బైక్, కారు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కారులో మద్యం సీసాలు కనిపించాయి.

హైదరాబాద్‌ నగరంలో వాహనాల సంఖ్య పెరిగి.. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. చాలా మంది వాహనదారులు వేగంగా దూసుకువెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

Next Story