ఆస్పత్రిలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఆక్సిజన్ పైపు కూడా పెట్టలేదని.. ఇప్పటికైతే బతికే ఉన్నా.. త్వరగా ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ.. కరోనా బారిన పడిన ఓయూ విద్యార్థి నేత.. తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన మాటలు అందరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అయితే.. అవే అతడి చివరి మాటలు అయ్యాయి.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్ ఓయూలో విద్యార్థి ఐకాస నేతగా ఉన్నాడు. కరోనా బారిన పడడంతో.. పది రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన భార్యకు ఫోన్ చేసి ఆస్పత్రిలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఆక్సిజన్ పైపు పెట్టడం లేదని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పాడు. వెంటనే తనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కోరాడు. సోమవారం ఉదయం ఆస్పత్రిలోనే మృతి చెందాడు. ఆక్సిజన్ పెట్టకపోవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పాడని కృష్ణ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే.. ఆస్పత్రి వర్గాలు మరో రకంగా చెప్పాయి. ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించామని.. పరిస్థితి విషమించడంతోనే ఆయన మృతి చెందాడని అంటున్నాయి.