హైద‌రాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. ఆన్‌లైన్‌లో భార‌త్‌, న్యూజిలాండ్ వ‌న్డే మ్యాచ్ టికెట్లు

Online ticket sales for Ind vs NZ ODI to open on 13 Jan.హైద‌రాబాద్‌లోని క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 9:08 AM IST
హైద‌రాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. ఆన్‌లైన్‌లో భార‌త్‌, న్యూజిలాండ్ వ‌న్డే మ్యాచ్ టికెట్లు

హైద‌రాబాద్‌లోని క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 18న జ‌రిగే తొలి వ‌న్డే మ్యాచ్ కు ఉప్ప‌ల్ స్టేడియం అతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌(హెచ్‌సీఏ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్ని ఆన్‌లైన్‌లోనే విక్ర‌యించ‌నున్న‌ట్లు తెలిపింది. ఎట్టిప‌రిస్థితుల్లో ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండ‌వ‌ని చెప్పింది. రేప‌టి నుంచి అంటే జ‌న‌వ‌రి 13న నుంచి ఆన్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.

దాదాపు నాలుగేళ్ల త‌రువాత ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సారి మ్యాచ్ టికెట్లు ఆఫ్‌లైన్‌లో విక్ర‌యించ‌డం లేదు. కేవ‌లం పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మ్యాచ్ సంద‌ర్భంగా అభిమానుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుటుంన్నాం. జ‌న‌వ‌రి 13 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి.

ఇక స్టేడియం సీటింగ్ కెపాసిటీ 39,112 కాగా ఇందులో కాంప్లిమెంట‌రీ కింద 9,695 టికెట్లు తీసివేస్తారు. మిగ‌తా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించ‌నున్నారు.

- జనవరి 13న 6,000

- జనవరి 14న 7,000

- జనవరి 15న 7,000

- మిగిలిన టిక్కెట్లు జనవరి 16న

- టిక్కెట్ ధరలు రూ. 850 నుండి రూ. 17,700

- ఒక‌రు 4 టికెట్ల వ‌ర‌కు కొనుగోలు చేయవచ్చు


అయితే.. స్టేడియంలోకి ప్రవేశించడానికి ఫిజికల్ టిక్కెట్లు తప్పనిసరి. ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసిన వారికి లావాదేవీకి సంబంధించిన ఇమెయిల్, SMS వ‌స్తుంది. ఈ కమ్యూనికేషన్‌లో QR కోడ్ కూడా ఉంటుంది. ఫిజిక‌ల్ టికెట్‌ను తీసుకునేందుకు ఈ క్యూఆర్ కోడ్‌ను రిడెంప్షన్ కౌంటర్‌లో చూపించాలి. గచ్చిబౌలిలోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, GMC బాలయోగి స్టేడియంలో జనవరి 15 నుంచి భౌతికంగా టికెట్లు జారీ చేయ‌నున్నారు. ఈ కౌంట‌ర్ల‌లో క్యూ ఆర్ కోడ్ చూయించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడి ప్రూఫ్ యొక్క ఫోటోకాపీని కూడా తీసుకెళ్లాలి.

గ‌తేడాది ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా టికెట్ల విక్ర‌యాల్లో తొక్కిస‌లాట జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గ‌త‌సారి జ‌రిగిన పొర‌బాట్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సారి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ చెప్పారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో చివరి వన్డే మ్యాచ్ 2019లో భారత్, ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య జరిగింది.

Next Story