హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

Online sale of Formula E race tickets has started. హైదరాబాద్: ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని స్ట్రీట్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు జరగనుంది.

By అంజి  Published on  4 Jan 2023 2:00 PM GMT
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం

హైదరాబాద్: ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని స్ట్రీట్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు జరగనుంది. భారతదేశంలోనే తొలిసారిగా జరగనున్న ఫార్ములా ఈ రేసును వీక్షించేందుకు టిక్కెట్ల విక్రయం బుధవారం ప్రారంభమైంది. 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, తేలికైన, అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన ఎలక్ట్రిక్ రేస్ కారు - Gen3' ఈవెంట్ కోసం ఫిబ్రవరి 11న హైదరాబాద్‌కు రాబోతోంది. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఓ కార్యక్రమంలో మొదటి టిక్కెట్‌ను బుక్ చేశారు. ఈ సందర్భంగా అరవింద్‌ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ను ఈ-మొబిలిటీకి ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తుందని అన్నారు.

22 కార్లతో మొత్తం 11 టీమ్‌లు ఇక్కడ రేసింగ్‌లో పాల్గొంటాయని, వాటిలో కొన్ని అగ్రశ్రేణి రేసింగ్ కంపెనీలు ఉన్నాయని ఆయన చెప్పారు. గ్రాండ్‌స్టాండ్‌లకు రూ. 1,000, చార్జ్‌డ్ గ్రాండ్‌స్టాండ్‌లకు రూ. 3,500, ప్రీమియం గ్రాండ్‌స్టాండ్‌లకు రూ. 6,000, ఏస్ గ్రాండ్‌స్టాండ్‌లకు రూ. 10,000 టిక్కెట్ల విలువతో నిర్వాహకులు దాదాపు 22,500 టిక్కెట్లను అమ్మకానికి పెట్టారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు బుక్‌మైషో, AceNetGenలో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. రేసు వీక్షణ కోసం సీటింగ్ సామర్థ్యం దాదాపు 25,000 కాగా, అమ్మకానికి అందుబాటులో ఉంచిన టిక్కెట్లు 22,500.

అరవింద్‌ కుమార్‌ ఇంకా మాట్లాడుతూ.. ''18 మలుపులతో కూడిన 2.8కిలోమీటర్ల ట్రాక్‌లో 11 టీమ్‌లు 22 మంది డ్రైవర్లతో హైదరాబాద్ వీధుల్లో ఈ రేసింగ్ జరగనుంది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత నెలలో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్, ప్రవేశం, అభిమానుల నిష్క్రమణ, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లు పరంగా మాకు మంచి అనుభవం అందింది. మూడు సంస్థలు సేఫ్టీ ఆడిట్‌ చేస్తున్నాయి. 18 మలుపులు రేసును ఉత్తేజపరుస్తాయి. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ ఆంక్షలపై ముందస్తుగా ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తాం'' అని అన్నారు.

''ఇప్పటికే టిక్కెట్‌లకు భారీ స్పందన వస్తోంది. రద్దీని నియంత్రించడం మాకు కష్టంగా ఉన్నందున మేము టిక్కెట్లను ఉచితంగా ఇవ్వలేము. వీక్షకుల కోసం పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తాం. రేస్‌కు మూడు రోజుల ముందు ట్రాక్‌ను బ్లాక్‌ చేస్తారు'' అని అరవింద్‌ తెలిపారు.

Next Story