టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు
Offline Ticket sales starts at Gymkhana Grounds Today.ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20
By తోట వంశీ కుమార్ Published on 22 Sept 2022 9:31 AM ISTహైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఉప్పల్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఎంతో మంది క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) వెల్లడించింది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానానికి అభిమానులు పోటెత్తారు. టికెట్ల కోసం బారులు తీరారు. కాగా.. ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు. టికెట్లు కొనేందుకు వచ్చేవాళ్లు ఆధార్ తప్పనిసరిగా తీసుకురావాలని హెచ్‌సీఏ సూచించింది.
బుధవారం టికెట్ల విక్రయానికి సంబంధించి తీవ్ర గందరగోళం కొనసాగింది. మ్యాచ్ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటూ హెచ్‌సీఏ సాగదీసింది. దీంతో హెచ్‌సీఏ వైఖరికి నిరసనగా జింఖానా మైదానం వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు దిగివచ్చారు. నేటి నుంచి జింఖానా గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు.
మరోవైపు.. హెచ్‌సీఏ వైఖరిపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల గందరగోళంపై రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చితే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని సూచించారు.