Hyderabad: ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్..ప్రణాళికలపై దృష్టి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 11:55 AM ISTHyderabad: ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్..ప్రణాళికలపై దృష్టి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక కిలోమీటరు దూరం ప్రయాణం చేయడానిని గంటకు పైగా సమయం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినా కూడా ట్రాఫిక్ రద్దీ పూర్తిగా అయితే తగ్గలేదు. మెట్రో అందుబాటులో లేని ప్రాంతాల్లో రద్దీ ఎప్పటిలానే ఉంటోంది. అయితే.. ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. దాంతో.. ఉన్నతాధికారులు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఆర్డీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిశోర్, జీహెచ్‌ంఎసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారుల సలహాలు, సూచనలతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం కసరత్తులు ప్రారంభించింది.
ఈ మేరకు నగరంలోని రోడ్ల ఆక్రమణలు, పార్కింగ్, రద్దీగా ఉండే రోడ్లపై ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం, ఇక అసంపూర్తిగా ఉన్న వంతెనలను నిర్మించడం, చెత్త డంపింగ్ వంటివి ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యే అంశాలపై అధికారులు చర్చించారు. రోడ్ల విస్తరణకు అవకాశాలను పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉఉన్న రోడ్లపై ఆక్రమణలు తొలగింపు ప్రక్రియను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని పలు సూచనలు చేశారు. ఇక నీటి పనులు, విద్యుత్ పనులు జరుగుతున్న తరుణంలో రోడ్డు తవ్వకం, పూడికతీత పనులపై దృష్టి సారించాలని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రణాళికల ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించారు.