నేటి నుంచే నుమాయిష్
Numaish Exhibition Starts from today.నగరవాసులను అలరించేందుకు 82వ నుమాయిష్ సిద్దమైంది.
By తోట వంశీ కుమార్
నగరవాసులను అలరించేందుకు 82వ నుమాయిష్ సిద్దమైంది. 'నుమాయిష్'గా ప్రసిద్ధి చెందిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (ఏఐఐఈ) నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి(జనవరి 1) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భాగ్యనగర వాసులు ఈ ప్రదర్శన కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి అధిక సంఖ్యలో ప్రజలు నుమాయిష్‌ను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకున్నారు.
నేటి(జనవరి 1) నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరగనుంది. నూతన సంవత్సరం వేళ ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి లు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన 2400 స్టాళ్లు ఎగ్జిబిషన్‌లో కొలువు దీరనున్నాయి. ప్రతీ రోజు మధ్యాహ్నాం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది.
కాగా.. ఈ సారి ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుం ధరను పెంచారు. గతంలో రూ.30 ఉండగా దాన్ని రూ.40 చేశారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సారి నుమాయిష్‌కు 22 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గతంలోలాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక రెండు ఫైరింజన్లు కూడా అందుబాటులో ఉంచారు.
స్థానికంగా తయారు అయ్యే ఉత్పత్తులకు ప్రచారం, ప్రోత్సాహం అందించాలన్నదే నుమాయిష్ ప్రధాన ఉద్దేశం.