టీడీపీ వ్యవస్థాపకుడు, నటుడు ఎన్టీఆర్ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. ఆమె ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకుంది. ఆ తర్వాత ఉమామహేశ్వరి పాడెను సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ, తదితరులు మోశారు. అనంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉమామహేశ్వరి చితికి భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు.
మరోవైపు ఉమా మహేశ్వరి(52) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని పోలీసులు వెల్లడించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉమా మహేశ్వరి మృతిపై ఆమె కుమార్తె దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య సంగతి బయటకు వచ్చింది. దీక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతోనే తమ తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు దీక్షిత వెల్లడించింది.