ఈ నెలలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో 1500 ఆశ వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.
బస్తీల సుస్తీ పోగొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు అద్భుతమైన సేవలు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకు కోటి మందికి పైగా ప్రజలు బస్తీ దవాఖానల్లో సేవల పొందినట్లు చెప్పారు. పేదల సౌకర్యార్థం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఆదివారం కాకుండా ప్రతి శనివారం సెలవు ఇస్తున్నట్లు చెప్పారు. ఆదివారం పని చేస్తాయన్నారు. త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని బస్తీ దవాఖానల్లో అమలు చేస్తామని చెప్పారు.
"ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. త్వరలో 134 రకాల పరీక్షలకు పెంచుతాం. 158 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నాం. బస్తీ దవాఖానల వల్ల ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఓపీ భారం తగ్గింది. దీని వల్ల ఆయా ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సల గణనీయంగా పెరిగింది. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాలో న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తాం. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తాం. "అని మంత్రి హరీశ్ రావు అన్నారు.