హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగరం అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు: భారత పురావస్తు శాఖ

No evidence to prove Hyderabad was once Bhagyanagar: ASI says in response to RTI. హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగరంగా మార్చాలనే డిమాండ్ ను పలువురు రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో బయటపెట్టారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Aug 2022 9:07 AM GMT
హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగరం అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు: భారత పురావస్తు శాఖ

హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగరంగా మార్చాలనే డిమాండ్ ను పలువురు రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో బయటపెట్టారు. దీనిపై తాజాగా భారత పురావస్తు శాఖ (ASI) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌కు ఒకప్పుడు భాగ్యనగరం అనే పేరు ఉండేదని రుజువు చేసే వివరాలు, చారిత్రక ఆధారాలు లేవన్నారు. RTI నుండి తాజాగా వచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిసింది. హైదరాబాద్‌కు ఎప్పుడైనా భాగ్యనగరం అని పేరు పెట్టారా, లేదా మార్చబడిందా అని ఆర్టీఐను అడిగారు. ఆగస్టు 4 నాటి RTI ప్రత్యుత్తరంలో.. "ఈ కార్యాలయంలో అలాంటి వివరాలు ఏవీ అందుబాటులో లేవు" అని ASI హైదరాబాద్ తెలిపింది. RTI కార్యకర్త రాబిన్ జాకీస్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు.

RTI ప్రకారం, హైదరాబాద్ నగరం పేరు మార్చబడలేదు. భాగమతి లేదా భాగ్యనగర్ పేరును సూచించే శాసనం, అప్పటి కాలానికి చెందిన నాణెం వంటి వివరాలు ఏవీ తమ వద్ద లేవని ASI పేర్కొంది. భారతదేశ మాజీ ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్‌గా లేదా మరేదైనా పేరుగా మార్చాలని ప్రతిపాదించిన దాఖలాలు ASI వద్ద లేవని తెలిపారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారనే వివరాలు తమ వద్ద లేవని ఆర్‌టీఐ సమాధానం చెప్పింది. ఈ రోజు చారిత్రక చార్మినార్ ఉన్న ప్రదేశంలో భాగ్యలక్ష్మి ఆలయం లేదా మరే ఇతర దేవాలయం ఉన్నట్లు తమ వద్ద ఎలాంటి రికార్డులు లేదా ఆధారాలు లేవని కూడా భారత పురావస్తు శాఖ పేర్కొంది. చరిత్రకారుడు, న్యాయవాది సయ్యద్ ఘియాసుద్దీన్ ప్రకారం.. భాగ్యలక్ష్మి ఆలయం 1960 లలో నిర్మించబడింది.

ఈ ఆలయ నిర్మాణం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. 2012లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలయ విస్తరణను నిలిపివేసింది. 2013లో ASI ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించింది. హైదరాబాద్ ను భాగ్యనగర్ గా పేరు మార్చాలనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. హైదరాబాద్‌కు భాగ్యనగరంగా నామకరణం చేయాలని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటించారు. జులై 3న హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ను 'భాగ్యనగరం'గా అభివర్ణించారు.

''హైదరాబాద్‌ పేరుకు చారిత్రక ఆధారాలు లేవని ప్రభుత్వ సంస్థ ఏఎస్‌ఐ చెబుతున్నప్పుడు భాగ్యనగర్‌గా పేరు మార్చాల్సిన అవసరం ఏముంది?" అని న్యూస్‌మీటర్‌తో రాబిన్ చెప్పుకొచ్చారు. దీనిపై చర్చ, పేరు మార్చమని అడగడం పూర్తిగా అవసరం లేని విషయమని ఆయన అన్నారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు.. ఇంకెన్నో నిజమైన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాబిన్ అన్నారు.

Next Story