హైదరాబాద్‌లోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కి, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారు భారీ మొత్తంలో జరిమానా చెల్లించుకోవాల్సిందే. రాంగ్ రూట్‌లో వెళ్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200, సిగ్నల్స్ దగ్గర ఉన్న స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీలెఫ్ట్ కు ఆటంకం కలిగిస్తే రూ.1000 జరిమానా వసూలు చేయనున్నారు.
ఈ నెల 28 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్ సరిగ్గా పాటించి సురక్షితంగా గమ్యం చేరేలా చేయడం కోసమే ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ట్రాపిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నిరోధించవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో వ్యతిరేక దిశ, ట్రిపుల్ రైడింగ్ చేసి దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా తర్వాత చాలా మంది సొంత వాహనాలు కొనుగోలు చేశారని, దీని వల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని సీపీ ఆనంద్ అన్నారు. బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా ఉండాలంటే నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కఠిన చర్యలు తప్పవన్నారు.