'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల గోడు పట్టించుకోండి'.. ప్రభుత్వానికి, ప్లాట్ఫామ్ కంపెనీలకు 'శ్రమ్' విజ్ఞప్తి
'నో ఏసీ క్యాంపెయిన్' కార్మికుల హక్కులను కాపాడాలని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలు గుర్తించాలని జాతీయ పట్టణ పోరాటాల వేదిక డిమాండ్ చేసింది.
By అంజి Published on 2 May 2024 9:58 AM GMT'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల గోడు పట్టించుకోండి'.. ప్రభుత్వానికి, ప్లాట్ఫామ్ కంపెనీలకు 'శ్రమ్' విజ్ఞప్తి
'నో ఏసీ క్యాంపెయిన్' కార్మికుల హక్కులను కాపాడాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలు గుర్తించాలని జాతీయ పట్టణ పోరాటాల వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్‌తో సంబంధం ఉన్న వేలాది మంది డ్రైవర్లకు, 'నో ఏసీ క్యాంపెయిన్'కు జాతీయ - తెలంగాణ రాష్ట్ర పట్టణ పోరాటాల వేదిక సంఘీభావం తెలిపింది. దాదాపు మూడు వారాలుగా ఉబర్, ఓలా, రాపిడో వంటి యాప్స్‌లో పని చేసే డ్రైవర్లు హైదరాబాద్‌లో 'నో ఏసీ క్యాంపెయిన్' నిర్వహిస్తున్నారు. టీజీపీడబ్ల్యూయూ ఆధ్వర్యంలో ప్లాట్ఫామ్ కంపెనీలు కిలోమీటర్‌కు ఛార్జీలు తగ్గించడంపై దృష్టి సారించేందుకు ఈ క్యాంపెయిన్ నిర్వహించబడుతోంది.
తెలంగాణలో తీవ్ర ఎండల వల్ల, హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుండటంతో ఈ ప్లాట్ ఫాం కంపెనీల్లో పని చేసే డ్రైవర్లుతమ కార్లలో ఏసీని ఆన్ చేయకుండానే డ్రైవింగ్ చేయాల్సి వస్తోందని టీజీపీడబ్ల్యూయూ తెలిపింది. ఏసీతో క్యాబ్‌లను నడపడానికి కిలోమీటరుకు రూ.16 నుంచి 18 ఖర్చు అవుతోందని , ఉబర్, ఓలా, రాపిడో సంస్థలు వసూలు చేసే కమీషన్లను లెక్కించిన తర్వాత రూ.10-12 మాత్రమే సంపాదించగలుగుతున్నారని, పెరుగుతున్న ఇంధనం ధర, నిర్వహణ ఖర్చులతో డ్రైవర్లు తమ వాహనాల్లో ఏసీలను స్విచ్ ఆన్ చేయలేకపోతున్నారని టీజీపీడబ్ల్యూయూ పేర్కొంది.
యాప్ ఆధారిత ట్యాక్సీలకు, సాధారణ ట్యాక్సీలకు ఒకే విధమైన ఛార్జీల నిర్మాణాన్ని అమలు చేయాలని 2024 ఫిబ్రవరిలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో యాప్ ఆధారిత ట్యాక్సీలకు యూనిఫాం ఛార్జీల ముఖ్యమైన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలకు హైలెట్ చేయాలని టీజీపీడబ్ల్యూయూ భావిస్తోంది. డ్రైవర్లు అధిక - నాణ్యత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించలేకపోవడం పట్ల నిజాయితీగా విచారం వ్యక్తం చేస్తున్నారని టీజీపీడబ్ల్యూయూ పేర్కొంది. కొందరు డ్రైవర్లకు ప్లాట్ఫామ్‌లను అనేక బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఈ ప్రచారం గురించి మాట్లాడటానికి భయపడుతున్నారని తెలిపింది.
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కింద యాప్ ఆధారిత డ్రైవర్లను తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలుగా పరిగణించాలని శ్రమ్ డిమాండ్ చేసింది. గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్లు, డ్రైవర్లకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసి, వారి హక్కులు, ప్రయోజనాలు పరిరక్షించడానికి పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని వివిధ శ్రామిక పోరాట వేదికలు డిమాండ్ చేశాయి.