ఉప్పొంగుతున్న మూసీ.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో వరద పోటెత్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
By అంజి Published on 5 Sep 2023 7:30 AM GMTఉప్పొంగుతున్న మూసీ.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో వరద పోటెత్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ నది మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండింటిలో ఒక్కొక్కటి రెండు గేట్లను ఎత్తారు. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా ఇన్‌ఫ్లో చేరడంతో మిగులు జలాలను విడుదల చేయాలని ఈ ఉదయం నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం నాటికి, ఉస్మాన్ సాగర్ పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) 1790 అడుగులకు వ్యతిరేకంగా 1789 అడుగులు. అదేవిధంగా, హిమాయత్ సాగర్ మట్టం 1763.20 అడుగులకు గాను ఎఫ్‌టిఎల్ 1763.50 అడుగులుగా ఉంది.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. జూలైలో రిజర్వాయర్ల వరద గేట్లను తెరిచినప్పుడు మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో నీటిమట్టం, చాదర్‌ఘాట్ కాజ్‌వే వంతెన దగ్గరకు చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రెండు ప్రాంతాలతో పాటు జియాగూడ, పురానాపూల్, దుర్గానగర్, సరూర్‌నగర్ వాసులను కూడా అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నగరంలో భారీ వర్షపాతాన్ని అంచనా వేసి, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్ష సూచనల దృష్ట్యా, హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే కొన్ని గంటలపాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలి.
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు చేరుకోవడంతో ఎర్రగడ్డ నుండి కూకట్ పల్లి వై జంక్షన్ వైపు వచ్చే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ నుండి కిలోమీటర్ల మేర వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథంలోనే అధికారులు వెంటనే అప్రమత్తమై ఎర్ర గడ్డ మూసాపేట్ మీదుగా కూకట్పల్లి వెళ్లాలనుకునేవారు ఆ రూట్ ను అవాయిడ్ చేయాలని సూచించారు. మూసాపేట్ దగ్గర భారీ ఎత్తున వరద ప్రవాహం ఉంది దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కూకట్పల్లి వైపు వెళ్లేవారు ఎర్రగడ్డ రూట్ కాకుండా ప్రత్యామ్నాయ దారులలో వెళ్లడం మంచిదని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువు కట్టలు తెగడం వల్ల భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తోంది.